ETV Bharat / city

Traffic Challans : ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఇక అంతే!

author img

By

Published : Feb 21, 2022, 9:52 AM IST

Traffic Challans : ఏపీలో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే వాహనదారులు ఇకపై బారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు. గతంలో మాదిరి రూ. 100 చెల్లించే వెళ్లిపోదాంలే అనుకుంటే కుదరదు. హెల్మెట్, సీట్ బెల్ట్ లేకపోతే వెయ్యి, పర్మిట్ లేని వాహనాలకు రూ.10 వేలు జరిమానా విధించనున్నారు. 2020 అక్టోబరులోనే ఉత్తర్వులు రాగా.. ఇటీవలే అవి అమల్లోకి వచ్చాయి.

Traffic Challans
Traffic Challans

Traffic Challans : హెల్మెట్‌ లేకుండా బైక్‌పై వెళ్తున్నారా? రవాణాశాఖ అధికారులు పట్టుకుంటే గతంలో మాదిరిగా రూ.100 చెల్లించి వెళ్లిపోదామంటే కుదరదు. ఇప్పుడు రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నారు. దీనితోపాటు 3 నెలలు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను అనర్హత చేసే అధికారమూ ఉంటుంది. కారులో సీట్‌ బెల్టు పెట్టుకోకపోతే గతంలో మాదిరి రూ.100 సరిపోదు.. వెయ్యి కట్టాల్సిందే. గూడ్స్‌ ఆటో, లారీల్లో పరిమితికి మించి ఎక్కువ ఎత్తులో సరకు తీసుకెళ్తుంటే రూ.20 వేలు చెల్లించాలి. రవాణాశాఖ కొద్ది రోజులుగా జరిమానాల్ని వసూలు చేస్తుండగా వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. కొన్నిచోట్ల అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. తామేమీ చేయలేమని, కొత్త నిబంధనల ప్రకారం సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసిన మేరకే జరిమానాలు వేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖ అధికారులు ఇటీవల కొద్ది రోజులుగా ఆయా ఉల్లంఘనలకు సగటున నిత్యం రూ.కోటి వరకు జరిమానాలు విధిస్తున్నారు. ఈ నెల 15 వరకు రూ.148 కోట్లు వసూలు చేశారు.

కొవిడ్‌తో అమలు కాక...

ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు రహదారి భద్రతలో భాగంగా కేంద్రం మోటారు వాహన సవరణ చట్టం-2019 కింద జరిమానాలు పెంచింది. ఏ ఉల్లంఘనకు ఎంత జరిమానా అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించే అధికారం ఉండగా, కేంద్రం ఎలా ఖరారు చేస్తుందని కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం తెలిపాయి. దీనిపై పలు దఫాలు చర్చల తర్వాత.. 37 సెక్షన్లలో కొన్ని మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం 2020, అక్టోబరు 21న కొత్త జరిమానాల అమలుపై ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు అప్పట్లోనే రవాణాశాఖ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. కొవిడ్‌ కారణంగా కేంద్రం కొన్ని వెసులుబాట్లు ఇచ్చింది. పర్మిట్లు లేకపోయినా, డైవింగ్‌ లైసెన్స్‌లు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల పునరుద్ధరణ జరగకపోయినా.. మినహాయింపు ఇస్తూ, ఆ గడువును పెంచుతూ వచ్చింది. 2020 మార్చి నుంచి, 2021 అక్టోబరు దాకా మినహాయింపులు వర్తించాయి. గత ఏడాది నవంబరు నుంచి పొడిగించలేదు. తాజాగా ఇటీవల రవాణాశాఖ అధికారులు అన్ని జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఉల్లంఘనలకు జరిమానాలు విధిస్తున్నారు. 2020లో వచ్చిన కొత్త జీవో ప్రకారం ఈ జరిమానాలు ఉండటంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు.

అవి పాతవే..

రవాణాశాఖ భారీగా జరిమానాలు విధిస్తుండగా, అవే ఉల్లంఘనలకు పోలీసుల జరిమానాలు మాత్రం పాతవే ఉంటున్నాయి. హెల్మెట్‌ ధరించకపోతే పోలీసులు రూ.100 జరిమానా విధిస్తే, మీరు రూ.వెయ్యి ఎలా ఫైన్‌ వేస్తారని రవాణాశాఖ అధికారులను కొందరు వాహనదారులు నిలదీస్తున్నారు. 2020 అక్టోబరులో ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చాక, పోలీస్‌శాఖ సాఫ్ట్‌వేర్‌లో ఇంకా వీటిని మార్చలేదని, అందుకే వారు పాత జరిమానాలు విధిస్తున్నట్లు చెబుతున్నారు.

గతంలో ఇచ్చిన ఉత్తర్వులే: ఏపీ మంత్రి పేర్ని నాని

ఉల్లంఘనలపై విధిస్తున్న జరిమానాలకు సంబంధించి ఉత్తర్వులు 2020లోనే ఇచ్చామని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. కొవిడ్‌ కారణంగా ఇంతకాలం తనిఖీలు చేయలేదని, అందుకే జరిమానాలు విధించలేదని పేర్కొన్నారు. ఇప్పుడూ ద్విచక్రవాహనదారులు, ఆటోలు, వ్యవసాయ ఉత్పత్తులు తీసుకెళ్లే ట్రాక్టర్ల విషయంలో ఉల్లంఘనలు ఉంటే వెంటనే జరిమానా విధించొద్దని, కౌన్సిలింగ్‌ చేయాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. దీనిపై రెండు, మూడు రోజుల్లో మరోసారి అధికారులతో సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు.

పెరిగిన రుసుములు ఇవే.

ఇదీచూడండి: పుట్టినరోజు నాడే బాలిక​పై సామూహిక అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.