ETV Bharat / business

రూ.6వేల కోట్లలో మీకూ వాటా! ఫేస్​బుక్​ ఖాతా ఉంటే చాలు.. అప్లై చేసుకోండిలా..

author img

By

Published : Apr 24, 2023, 1:22 PM IST

మీరు ఫేస్​బుక్ వాడుతుంటారా? అయితే మీకో గుడ్​న్యూస్! రూ.6వేల కోట్ల పరిహారంలో మీకూ వాటా వచ్చే ఛాన్స్ ఉంది. గతంలో ఫేస్​బుక్ అనలిటికా కుంభకోణంపై నమోదైన కేసులో.. పరిహారం చెల్లించేందుకు ఫేస్​బుక్​ మాతృసంస్థ మెటా ఇదివరకే ఒప్పుకుంది. దీనికి మీరూ అప్లై చేసుకోవచ్చు. ఎలాగో తెలుసా?

facebook settlement claim form 2023
facebook settlement claim form 2023

2007 నుంచి​ 2022లో మధ్య మీరు ఎప్పుడైన ఫేస్​బుక్​లో యాక్టివ్​ యూజర్​గా ఉన్నారా? అయితే రూ.6వేల కోట్లలో మీ షేర్​ తీసుకోవడానికి మీరు అర్హులే. ఎందుకంటే ఫేస్​బుక్ అనలిటికా కుంభకోణంలో.. యూజర్లందరికీ ఫేస్​బుక్​ పరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది. ఇంకెందుకు ఆలస్యం.. మీ వాటాను క్లెయిన్​ చేసుకోండిలా..

వినియోగదారుల గోప్యతకు భంగం కలిగించిందనే ఆరోపణలతో ఫేస్​బుక్​పై గతంలో కేసు నమోదైంది. ప్రముఖ బ్రిటిష్​ పొలిటికల్​ కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్​ అనలిటికాతో పాటు ఇతర థర్డ్ పార్టీ వ్యక్తులు/సంస్థలు..​ యూజర్ల వ్యక్తిగత డేటాను యాక్సెక్ చేసేలా ఫేస్​బుక్ వీలు కల్పించిందని ఆరోపణలు వచ్చాయి. మొత్తం 8.7 కోట్ల మంది యూజర్ల ప్రైవేటు సమాచారం లీక్ అయిందని తేలింది. అప్పట్లో ఈ విషయంపై అంతర్జాతీయంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. నాలుగేళ్ల న్యాయ పోరాటం తర్వాత.. యూజర్లకు 725 మిలియన్ల (సుమారు రూ.6వేల కోట్లు) పరిహారం అందించడానికి ఫేస్​బుక్​ గతేడాది డిసెంబర్​లో ఒప్పుకుంది. ఈ కేసులో సెటింల్​మెంట్​ చేసుకునేందుకు కాలిఫోర్నియా కోర్టు జడ్జి ప్రాథమిక ఆమోదం తెలిపారు. దీంతో, ఫేస్​బుక్​ ఇచ్చే పరిహారం కోసం క్లెయిమ్​ చేసుకునేందుకు వినియోగదారులకు వీలు కలిగింది.

దరఖాస్తు ఇలా చేసుకోవాలి..
పరిహారంలో వాటా కోసం దరఖాస్తు చేసుకోవాలంటే.. వినియోగదారులు కొన్ని వ్యక్తిగత వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. facebookuserprivacysettlement.com వెబ్​సైట్​కు వెళ్లి Submit Claim పైన క్లిక్​ చేయాలి. అనంతరం ఒక ఆన్​లైన్​ ఫారం​​ నింపాలి. లేదంటే దాన్ని ప్రింట్​ తీసి పోస్ట్ చేయొచ్చు. ఆన్​లైన్​లో​ అయితే.. ఫామ్​ నింపడానికి కొన్ని నిమిషాలు మాత్రమే వ్యవధి ఉంటుంది. పోస్ట్​ను ఆగస్టు 25 లోపు సమర్పించాలి.

వీళ్లే అర్హులు..
2007 మే 24 నుంచి 2022 డిసెంబర్​ 22 మధ్య ఎప్పుడైనా యాక్టివ్​గా ఉన్న ఫేస్​బుక్ యూజర్లు.. దరఖాస్తు చేసుకోడానికి అర్హులు. అయితే, మీరు ప్రస్తుతం ఫేస్​బుక్​ వాడకపోయినా.. అకౌంట్లను తొలగించినా.. క్లెయిమ్​ చేసుకోవచ్చు. ఎవరికి ఎంత చెల్లిస్తారనే విషయంపై స్పష్టత లేదు. పైన ఉన్న తేదీల మధ్య మీరు ఎంతకాలం ఫేస్​బుక్​ అకౌంట్​ను కలిగిఉన్నారనే దాని ఆధారంగా.. చెల్లింపులు చేసే అవకాశముంది. సెటిల్​మెంట్​కు ఈ ఏడాది సెప్టెంబర్​లో ఆమోదం తెలిపిన తర్వాత... చెల్లింపులు చేస్తారని సమాచారం.

కేంబ్రిడ్జ్​ అనలిటికా కుంభకోణం నేపథ్యంలో.. ఫేస్​బుక్​ గోప్యతపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రైవసీ విధానంలో చాలా మార్పులు తీసుకువచ్చింది. 'మా కమ్యూనిటీ, షేర్​ హోల్డర్ల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని మేము సెటిల్​మెంట్​కు అంగీకరించాం' అని మెటా ప్రతినిధి ఒకరు గతేడాది డిసెంబర్​లో జరిగిన సెటిల్​మెంట్ ఒప్పందం తర్వాత ఓ ప్రకటనలో తెలిపారు. గత మూడేళ్లుగా తమ గోప్యతా విధానాన్ని పునరుద్ధరించినట్లు చెప్పారు. గోప్యత విధానాలను అనుసరించేలా.. పటిష్ఠ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.