దేశంలో ఫిన్ టెక్ వ్యాపారాలకు మంచి అవకాశాలు ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. గత ఐదేళ్లలో డిజిటల్ లావాదేవీలు 55 శాతానికిపైగా పెరిగినట్లు వెల్లడించారు. 2020లో దాదాపు రూ.274 కోట్ల డిజిటల్ లావాదేవీలు నిర్వహించినట్లు తెలిపారు. 2025 నాటికి ఫిన్ టెక్ మార్కెట్ విలువ రూ.6.2 లక్షల కోట్లకు పెరగొచ్చని అంచనా వేశారు. ఇండియా ఎకనామిక్ కాన్క్లేవ్ (ఐఈసీ) 2021 ప్రారంభ కార్యక్రమంలో దాస్ ఈ విషయాలు పేర్కొన్నారు. ప్రభావవంతమైన నిబంధనలకు ఆర్బీఐ ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని వెల్లడించారు.
ఆర్థిక రంగంలో ఆవిష్కరణలు అవసరం..
వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించేందుకు ఆర్థిక రంగంలో ఆవిష్కరణలు చాలా అవసరమని దాస్ స్పష్టం చేశారు. అయితే వీటికి నిబంధనలు అడ్డంకిగా మారకూడదని అభిప్రాయపడ్డారు. ఆర్టీజీఎస్, నెఫ్ట్ సేవలు ఇప్పుడు 24 గంటలు పని చేస్తున్నాయని.. విదేశీ కరెన్సీ సేవలను అందించే సామర్థ్యం ఈ వ్యవస్థలకు ఉందని తెలిపారు. అందువల్ల వీటి సేవలు విస్తరించే అవకాశముందన్నారు.
క్రిప్టో కరెన్సీపై ప్రభుత్వానిదే తుది నిర్ణయం..
క్రిప్టోకరెన్సీపై ప్రధాన సమస్యలను.. ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామని శక్తికాంత దాస్ తెలిపారు. ఈ అంశం ఇంకా పరిశీలన దశలో ఉందని.. ప్రభుత్వమే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. క్రిప్టోకరెన్సీ అంశంపై రిజర్వు బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం మధ్య అభిప్రాయభేదాలు లేవని స్పష్టం చేశారు.
ప్రథమ ప్రాధాన్యం అదే..
2008తో పోలిస్తే.. 2020లో ఆర్థిక సంక్షోభం చాలా భిన్నమైనదని శక్తికాంత దాస్ వివరించారు. ఇతర రంగాల క్షీణత ఆర్థిక రంగంపై తీవ్రంగా పడుతోందని చెప్పుకొచ్చారు. కరోనా కోరల నుంచి ప్రపంచార్థికం ఇంకా పూర్తిగా బయటపడలేదన్నారు. వైరస్ కొత్త వేరియంట్లు రికవరీకి ఆటంకంగా మారుతున్నట్లు వివరించారు. దీని వల్ల ఏర్పడే క్లిష్ట పరిస్థితుల నుంచి బలమైన మూలధన పునాదితో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల పటిష్ఠతను కాపాడటం ఆర్బీఐ ప్రథమ ప్రాధాన్యమని దాస్ స్పష్టం చేశారు.
ఆర్థిక రికవరీ, ధరల అదుపు, ఆర్థిక స్థిరత్వం కోసం అన్ని రకాల విధానపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కూడా దాస్ వివరించారు.
ఇదీ చదవండి:2021-22లో వృద్ధి రేటు 12.8 శాతం!