రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల చేపట్టిన వివిధ చర్యలను తక్షణమే అమలు చేయాల్సిందిగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంత దాస్ సూచించారు. బ్యాలెన్స్ షీట్లను పటిష్ఠం చేసుకోవడంపై దృష్టి సారించడాన్ని కొనసాగించాలని పీఎస్‌బీల మేనేజింగ్ డైరెక్టర్లు, ముఖ్య కార్యనిర్వహణ అధికారులతో జరిపిన సమావేశంలో ఆయన తెలిపారు.కరోనా మహమ్మారి సృష్టించిన అవరోధాలను ఎదుర్కొంటూనే ప్రజలకు, వ్యాపార సంస్థలకు రుణ సదుపాయాన్ని అందించడం సహా వివిధ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులది కీలక పాత్ర అని అన్నారు.
కొవిడ్-19 రెండో దశ నేపథ్యంలో అత్యవసర వైద్య సేవలకు రూ.50,000 కోట్ల వరకు తక్షణ నిధుల లభ్యత, ఎంఎస్‌ఎమ్‌ఈలకు రుణాల మంజూరును పెంచడం, రుణాల పునర్‌వ్యవస్థీకరణ, కేవైసీ నిబంధనల సులభతరం లాంటి పలు చర్యలను ఈ నెల ప్రారంభంలో ఆర్‌బీఐ చేపట్టిన సంగతి తెలిసిందే. ఆర్థిక రంగం స్థితిగతులు, చిన్న రుణ గ్రహీతలు, ఎంఎస్‌ఎమ్‌ఈలు సహా వివిధ రంగాలకు రుణాల మంజూరు, కొవిడ్ సంక్షోభ పరిష్కార ప్రణాళిక అమలు పురోగతి లాంటి అంశాలపై ఈ సమావేశంలో బ్యాంకర్లతో ఆర్‌బీఐ గవర్నరు చర్చించినట్లు తెలుస్తోంది.కొవిడ్-19కి సంబంధించి పరపతి విధాన సమీక్షలో చేపట్టిన నిర్ణయాల అమలుపైనా ఆయన అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు ఎం.కె.జైన్, ఎం.రాజేశ్వర్ రావు, మైఖేల్ డి పాత్ర, టి.రవిశంకర్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పతనం దిశగా ఆర్థిక వ్యవస్థ!