ETV Bharat / business

wipro: విలువలే శ్వాసగా.. విప్రో 75 ఏళ్ల ప్రయాణం

author img

By

Published : Sep 22, 2021, 5:27 AM IST

Updated : Sep 22, 2021, 6:36 AM IST

వంట నూనెల సంస్థగా ప్రారంభమైన విప్రో.. దిగ్గజ ఐటీగా సంస్థ ఎదిగింది. అందుకు కారణం విలువలు, నిజాయతీతో పనిచేయడమే అని చెప్పారు సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్ అజీమ్​ ప్రేమ్​జీ. సంస్థ నెలకొల్పి 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా 'ద స్టోరీ ఆఫ్‌ విప్రో' అనే పుస్తకాన్ని ఆయన పుస్తకం విడుదలచేశారు.

wipro latest news
అజీమ్ ప్రేమ్ జీ

దేశంలోని దిగ్గజ ఐటీ కంపెనీల్లో విప్రో ఒకటి. వంట నూనెల కంపెనీగా ప్రారంభమై, క్రమంగా ఎన్నో వ్యాపారాలకు విస్తరించి ప్రపంచ ఖ్యాతి గడించింది. ఈ సంస్థ 75 వసంతాల వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా 'ద స్టోరీ ఆఫ్‌ విప్రో' పేరుతో ఓ పుస్తకాన్ని సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ విడుదల చేశారు. వెస్ట్‌లాండ్‌ పబ్లికేషన్స్‌ దీనిని ప్రచురించింది. ఈ సందర్భంగా విప్రో ప్రయాణానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను అజీమ్‌ ప్రేమ్‌జీ వెల్లడించారు. ఆయన ఏం చెప్పారంటే..

wipro latest news
విప్రో

వారానికి రూ.2లతో

75 ఏళ్ల క్రితం మా తాత బియ్యం ట్రేడింగ్‌ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. వారానికి రూ.2 ఆర్జించేవారు. ఆ వ్యాపారం అంచెలంచెలుగా ఎదిగి, బహుళ వ్యాపారాలు నిర్వహిస్తున్న దిగ్గజ సంస్థగా అవతరించింది. నిజాయతీ అనే ప్రాథమిక సూత్రంతో ఆయన వ్యాపారాన్ని నడిపారు. విలువల్లో ఎప్పుడూ రాజీపడే వాళ్లు కాదు. మా తాత తదనంతరం మా నాన్న మొహ్మదుసేన్‌ హసేమ్‌ ప్రేమ్‌జీ సంస్థ బాధ్యతలు చేపట్టారు. అప్పుడు ఆయన వయస్సు 21 ఏళ్లే. మా తాత ఏవైతే విలువలు, నిజాయితీకి ప్రాధాన్యం ఇచ్చారో.. వాటిని మా నాన్నా పాటించి సంస్థను విజయ పథాన నడిపించారు.

wipro latest news
అజీమ్ ప్రేమ్ జీ

అమ్మ నుంచే నేర్చుకున్నా..

మా అమ్మ గుల్బానూ ప్రేమ్‌జీ కూడా సవాళ్లను ఎదుర్కొనడంలో వెనుకడుగు వేసే వారు కాదు. పిల్లల ఆసుపత్రి నిర్మాణం కోసం ఆమె అసాధారణ పోరాటమే చేశారు. నేనూ మా అమ్మ నుంచే ఎక్కువగా నేర్చుకున్నానని అనుకుంటున్నాను. ఆమె వైద్య వృత్తి నిర్వహించేవారు. చిన్న పిల్లల కోసం ఆర్థోపెడిక్‌ ఆసుపత్రి నిర్మించేందుకు అహర్నిశలు కృషి చేశారు. మేము ఆ సమయంలో అంత ధనవంతులం కాదు. అందుకే దిల్లీకి వెళ్లి ఆసుపత్రి నిర్మాణానికి ఆమె విరాళాలు సేకరించే వారు. ఆసుపత్రి కోసం ఎంతో పోరాటం చేశారు. ఒక విధానంపై నిలబడటం.. రాజీపడకపోవడం లాంటి వాటిని చిన్న వయసులోనే నేను అలవర్చుకున్నాను.

wipro latest news
విప్రో కార్యాలయం

చదువు మధ్యలో మానేసి..

వంటనూనెల తయారీ నిమిత్తం 1945 డిసెంబరు 29న మహారాష్ట్రలోని అమల్నార్‌లో వెస్టర్న్‌ ఇండియా ప్రోడక్ట్స్‌ లిమిటెడ్‌ను ప్రేమ్‌జీ తండ్రి హసేమ్‌ స్థాపించారు. 1966లో ఆయన మరణించారు. ఆ సమయంలో స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలో ప్రేమ్‌జీ చదువుతున్నారు. అప్పుడు ఆ చదువును ఆపేసి కంపెనీ బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ప్రేమ్‌జీ వయసు 21 ఏళ్లే. తాత, తండ్రిలా కాకుండా ప్రేమ్‌జీ సంస్థ కార్యకలాపాలను పలు వ్యాపారాల్లోకి విస్తరించారు.

  • 1989 ఐటీ విభాగంలోకి సంస్థ అడుగుపెట్టింది. ఆ తర్వాత వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, లైటింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంజినీరింగ్‌, ఆరోగ్య సంరక్షణలోకి విస్తరించింది.
  • 2000లో విప్రో 1 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలోకి అడుగుపెట్టింది.
    wipro latest news
    'ద స్టోరీ ఆఫ్‌ విప్రో' పుస్తకం

53 ఏళ్ల పాటు సేవలు

53 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు విప్రోకు అకుంఠిత దీక్షతో సేవలందించిన అజీమ్‌ ప్రేమ్‌జీ 2019 జులై 31న సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దాతృత్వానికి మరింత సమయాన్ని వెచ్చించే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పటివరకు కంపెనీలో చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆయన కుమారుడు రిషద్‌ ప్రేమ్‌జీ, విప్రో ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ బాధ్యతలు చేపట్టారు.

"ద స్టోరీ ఆఫ్‌ విప్రో.. ద స్టోరీ ఆఫ్‌ అజీమ్‌ ప్రేమ్‌జీది కూడా. ఎందుకంటే 75 ఏళ్లలో 53 ఏళ్ల పాటు విప్రోకు ఆయనే సారథి"

- రిషద్‌ ప్రేమ్‌జీ, విప్రో ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌

దాతృత్వానికి మారుపేరు..

దిగ్గజ పారిశ్రామికవేత్తగానే కాదు దాతృత్వానికీ ప్రేమ్‌జీ మారుపేరు. ఎడెల్‌గీవ్‌ హురున్‌ ఇండియా దాతృత్వ జాబితా 2020 ప్రకారం.. ప్రేమ్‌జీ రూ.7904 కోట్లు విరాళంగా ఇచ్చారట. ఆయన తర్వాతి స్థానంలో ఉన్న హెచ్‌సీఎల్‌ సహ వ్యవస్థాపకుడు శివ్‌ నాడార్‌ విరాళంగా ఇచ్చింది రూ.795 కోట్లు.

ఇదీ చూడండి: అంతా రెడీ.. విప్రో ఉద్యోగులు ఇక ఆఫీస్​కే!

Last Updated :Sep 22, 2021, 6:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.