ETV Bharat / business

వాహన బీమా విషయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా?

author img

By

Published : Dec 3, 2021, 1:10 PM IST

Vehicle insurance policy: కొవిడ్‌ తర్వాత వ్యక్తిగత ప్రయాణ వాహనాల్లో వెళ్లేందుకే చాలామంది ఇష్టపడుతున్నారు. దీంతో కారు కొనుగోలు చేసే వారి సంఖ్యా పెరిగింది. చట్ట ప్రకారం ప్రతి వాహనానికీ బీమా తప్పనిసరి. ఇందులోనూ కాంప్రహెన్సివ్‌, థర్డ్‌ పార్టీ అనే రెండు రకాలుంటాయి. రోడ్డుపైన వాహనం తిరగాలంటే... కనీసం థర్ట్‌ పార్టీ బీమా ఉండాల్సిందే. మరి, వాహన బీమా విషయంలో చేయకూడని పొరపాట్లేమిటో తెలుసుకుందామా...

vehicle insurance policy
వాహన బీమా

Vehicle insurance policy: వాహన బీమా పాలసీలను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో తీసుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు చాలామంది ఆన్‌లైన్‌లోనే పాలసీలను తీసుకోవడం, పునరుద్ధరించుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకోవాలనుకునే వారికి అవసరమైన సహాయాన్ని బీమా సంస్థల సహాయ కేంద్రాలు సిద్ధంగా ఉంటున్నాయి. కొత్తగా వాహన బీమా తీసుకునేటప్పుడు లేదా పునరుద్ధరణ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. చాలామంది తక్కువ ప్రీమియం ఉన్న పాలసీని తీసుకునేందుకు తొందరపడుతుంటారు. కానీ, సరైన పద్ధతి కాదనే చెప్పాలి. పలు అంశాలను పరిశీలించిన తర్వాతే.. మీ అవసరాలకు తగిన పాలసీని ఎంచుకోవడం ఎప్పుడూ మంచిది.

  • సాధ్యమైనంత వరకూ పూర్తి రక్షణ కల్పించే కాంప్రహెన్సివ్‌ పాలసీనే తీసుకోండి. ఇందులో థర్డ్‌ పార్టీ బీమా కలిసి ఉంటుంది. కేవలం చట్టబద్ధమైన నిబంధనలను పాటించేందుకు మాత్రమే బీమా అనే ధోరణిని విడనాడాలి. చిన్న ప్రమాదం జరిగినా.. మరమ్మతు ఖర్చు రూ.వేలల్లోనే ఉంటుందని మర్చిపోవద్దు.
  • కేవలం ప్రీమియం తక్కువగా ఉందన్న కారణంతో పాలసీని ఎంచుకోకూడదు. ఆ బీమా సంస్థ క్లెయిం పరిష్కార చరిత్ర, అందించే సేవలను పూర్తిగా తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి.
  • ప్రాథమిక పాలసీకి అనుబంధాలను జోడించుకుంటే కాస్త అదనపు ప్రీమియం చెల్లించాల్సిందే. దీన్ని తప్పించుకునేందుకు ఆయా పాలసీలను తీసుకోకుండా ఉండటం సరికాదు. అనుకోని సంఘటనల వల్ల వాహనానికీ, ఇంజిన్‌కూ ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు కొన్నిసార్లు ఈ అనుబంధ పాలసీలే ఆదుకుంటాయి. అయితే, అవి ఎంతమేరకు అవసరం అనేది పూర్తి అవగాహన ఉండాలి.
  • వ్యవధి ముగియకముందే పాలసీని పునరుద్ధరించుకోవాలి. లేకపోతే నో క్లెయిం బోనస్‌ (ఎన్‌సీబీ)ని కోల్పోయే ప్రమాదం ఉంది. క్లెయిం చేసుకోని ప్రతి ఏడాదికీ ఎన్‌సీబీ చెల్లిస్తారు. కాబట్టి, గడువు లోపే పునరుద్ధరణ చేయించడం మర్చిపోవద్దు. కొత్త కారు కొన్నప్పుడు మీ పాత కారు ఎన్‌సీబీనీ బదిలీ చేయించుకునేందుకు వీలుంటుంది. ఈ విషయంపై బీమా సంస్థతో చర్చించండి.
  • బీమా పాలసీ తీసుకునేటప్పుడు వాహనం వివరాలు, యజమాని వివరాల్లో తప్పులు లేకుండా చూసుకోండి. మీ దృష్టికి వచ్చిన తప్పులను వెంటనే బీమా సంస్థ దృష్టికి తీసుకెళ్లండి. మోసపూరిత బీమా క్లెయింలు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయొద్దు. ఇది శిక్షార్హమైన నేరం.

వాహన బీమా పూర్తి జాగ్రత్తలతో తీసుకోవాలి. నిర్లక్ష్యంగా ఉంటే.. కష్టకాలంలో మన జేబుపైనే ఆర్థిక భారం పడుతుంది.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.