ETV Bharat / business

క్రెడిట్ స్కోర్ తగ్గినా.. ఇలా చేస్తే రుణం ఖాయం!

author img

By

Published : Feb 18, 2022, 2:44 PM IST

Credit Score: సాధారణంగా క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉన్నప్పుడు అప్పు ఇవ్వాలంటే రుణదాతలు ఆలోచిస్తారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనకు సంబంధించిన కొన్ని వివరాలు తెలియజేయడం ద్వారా బ్యాంకుల నుంచి రుణం పొందవచ్చని నిపుణుల చెప్తున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

Credit Score
స్కోరు తగ్గినా.. రుణం వస్తుందిలా..

Credit Score: అవసరం ఏదైనా సరే.. డబ్బు కావాలంటే వెంటనే గుర్తుకొచ్చేది వ్యక్తిగత రుణమే. క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉన్నప్పుడు ఈ అప్పు తీసుకోవడం కష్టమే. ఇలాంటప్పుడు అదనంగా కొన్ని వివరాలు తెలియజేయడం ద్వారా బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు పరిస్థితులు అనుకూలించవచ్చు.

సరి చేసుకోండి: క్రెడిట్‌ స్కోరు నివేదికలో కొన్నిసార్లు తప్పులు దొర్లే అవకాశం లేకపోలేదు. ముందుగా మీ నివేదికను నిశితంగా పరిశీలించి, అందులో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా చూసుకోండి. రుణ వాయిదాలన్నీ సరిగ్గానే చెల్లిస్తున్నా.. స్కోరు మెరుగ్గా లేదంటే.. ఆ విషయాన్ని క్రెడిట్‌ బ్యూరోల దృష్టికి తీసుకెళ్లండి.

అదనపు ఆదాయం ఉంటే: క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉన్నప్పుడు బ్యాంకుకు మీ అదనపు ఆదాయానికి సంబంధించిన ఆధారాలు చూపించాలి. ఇందులో అద్దె ఆదాయం, ఇంక్రిమెంట్లలాంటివి ఉండొచ్చు. చెల్లించాల్సిన ఈఎంఐల కన్నా.. ఆదాయం అధికంగా ఉందని నిరూపిస్తే.. బ్యాంకు/ఆర్థిక సంస్థలు వ్యక్తిగత రుణం మంజూరు చేసేందుకు అవకాశాలు పెరుగుతాయి.

తక్కువ మొత్తానికి: తక్కువ క్రెడిట్‌ స్కోరున్నప్పుడు అధిక రుణం లభించడం కష్టమే. కాబట్టి, స్వల్ప మొత్తానికి రుణం తీసుకునేందుకు ప్రయత్నించాలి. దీనివల్ల ఈఎంఐ సులువుగా చెల్లించేందుకు వీలవుతుందని బ్యాంకు విశ్వసిస్తుంది. ఇలా చిన్న వాయిదాలు ఉన్నప్పుడు క్రమం తప్పకుండా చెల్లించడం ద్వారా క్రెడిట్‌ స్కోరు పెరిగేందుకూ ఉపయోగపడుతుంది.

ఉమ్మడిగా: అధిక మొత్తంలో రుణం కావాలి అనుకున్నప్పుడు జీవిత భాగస్వామితో కలిసి ఉమ్మడిగా దరఖాస్తు చేయొచ్చు. ఇదీ కుదరకపోతే.. హామీగా ఎవరినైనా చూపించి, రుణం తీసుకునే వీలూ ఉంటుంది. సహ దరఖాస్తుదారులు, హామీగా ఉండేవారూ కేవైసీ పత్రాలు, ఆదాయానికి సంబంధించిన ఆధారాలను బ్యాంకుకు అందించాలి. సహ దరఖాస్తుకు మంచి క్రెడిట్‌ స్కోరు ఉంటే.. రుణం రావడం తేలికవుతుంది.

కొన్నిసార్లు క్రెడిట్‌ స్కోరు అందుబాటులో ఉండకపోవచ్చు. కనీసం 36 నెలలకు మించి రుణాలు తీసుకోవడం, వాయిదాల చెల్లింపులాంటివి లేనప్పుడు ఇలా జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో రుణం తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాకపోతే రుణ మొత్తం తక్కువగా ఉండే అవకాశం ఉంది. రుణం తీసుకునేటప్పుడు అవసరం ఏమిటి అనేది ముందుగా చూసుకోవాలి. నిజంగా అవసరం అనిపిస్తేనే అప్పు చేయాలి. వడ్డీ రేట్లు, పరిశీలనా రుసుములు, ముందస్తు చెల్లింపు ఛార్జీల్లాంటివి పరిశీలించాకే బ్యాంకును ఎంపిక చేసుకోవాలి.

ఇదీ చూడండి:

మ్యూచువల్‌ ఫండ్ల సంఖ్యను తగ్గించుకోవడం మేలేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.