విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రపంచ అపరకుబేరుడి కిరీటాన్ని కోల్పోయారు. ఒక్క రోజులో టెస్లా షేర్లు 8.6 శాతం నష్టపోవడం వల్ల.. ఆయన సంపదలో 15.2 బిలియన్ డాలర్లు తగ్గింది. దీనితో ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి పడిపోయారు. ఫలితంగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మరోసారి ప్రపంచ అపర కుబేరుల్లో అగ్రస్థానానికి చేరారు.
బ్లూమ్‌బర్గ్ తాజా నివేదిక ప్రకారం.. బెజోస్ సంపద 186 బిలియన్ డాలర్లుగా ఉంది. మస్క్ సంపద 183 బిలియన్ డాలర్లకు తగ్గింది.
ఒక్క ట్వీట్‌తో భారీ నష్టం..
మస్క్ సంపద ఒక్క రోజులో ఈ స్థాయిలో తగ్గేందుకు ఆయన చేసిన ఓ ట్వీట్ కారణం. కొన్ని రోజుల కిందటే బిట్‌కాయిన్‌లో 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిన మస్క్.. తాజాగా 'బిట్‌కాయిన్, ఈథర్'ల విలువ ఎక్కువగా కనిపిస్తోందటూ ఓ ట్వీట్ చేశారు.
దీనితో రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న బిట్‌కాయిన్ విలువ ఒక్క సారిగా 12.5 శాతం పడిపోయింది. ఫలితంగా టెస్లా షేర్లు కూడా భారీగా పతనమవడం, ఆయన సంపద రికార్డు స్థాయిలో తగ్గటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఇదీ చదవండి:స్వతంత్ర సంస్థగా రిలయన్స్ ఓ2సీ విభాగం