ETV Bharat / state

GRMB MEETING: గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం భేటీ.. ఆ అంశంపైనే కీలకచర్చ!

author img

By

Published : Oct 10, 2021, 11:26 AM IST

Updated : Oct 10, 2021, 12:11 PM IST

godavari-river-management-board-meet-for-gazette-implementation
godavari-river-management-board-meet-for-gazette-implementation

11:22 October 10

గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశం

హైదరాబాద్​ జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం (GRMB SUB COMMITTE MEETING )సమావేశం అయింది. జీఆర్ఎంబీ సభ్య కార్యదర్శి బీపీపాండే నేతృత్వంలో భేటీకీ.. తెలుగు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. ఈ నెల 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చిస్తున్నారు. పెద్దవాగు ప్రాజెక్టును బోర్డు అధీనంలోకి తీసుకోవడంపై చర్చ జరుగుతోంది.  

తుది నివేదిక ఖరారు చేసేనా..

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్రం ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు దిశగా రంగం సిద్ధమవుతోంది. మొదటి దశలో అయిదు ప్రాజెక్టుల పరిధిలోని 29 కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకోవడానికి అవకాశం ఉన్నట్లు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం గుర్తించింది. మిగిలిన చోట్ల రెండు రాష్ట్రాలకు కొన్ని అభ్యంతరాలుండటం వల్ల ప్రస్తుతానికి వీలు కాదని పేర్కొంది. ప్రాజెక్టుల వారీగా సిబ్బంది, కార్యాలయాలు, యంత్రాలు, పరికరాలు ఇలా అన్ని అంశాలపై సమగ్ర ముసాయిదా తయారు చేసింది. దీనిపై ప్రస్తుతం జరుగుతున్న సమావేశంలో (GRMB SUB COMMITTE MEETING ) తుది నివేదికను ఖరారు చేసే అవకాశం ఉంది.

ఏమేరకు సమ్మతి తెలుపుతారో

కృష్ణా, గోదావరి బోర్డులకు సంబంధించి కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ (CENTRAL GOVERNMENT GAZETTE NOTIFICATION)అమలుపై రెండు బోర్డులూ రెండు ఉపసంఘాలను నియమించాయి. ఇందులో కృష్ణాబేసిన్‌ కీలకమైంది. ఈ కమిటీలో రెండు రాష్ట్రాల నుంచి నీటిపారుదల, జెన్‌కోలకు చెందిన నలుగురు చీఫ్‌ ఇంజినీర్లతో పాటు, కృష్ణా బోర్డు నుంచి అయిదుగురు ఉన్నారు. బోర్డుకు చెందిన రవికుమార్‌ పిళ్లై ఈ ఉపసంఘానికి కన్వీనర్‌గా ఉన్నారు. ఈ కమిటీ తయారు చేసిన ముసాయిదాపై ఈ భేటీలో చర్చించి.. తుది నివేదికను 12వ తేదీన జరిగే బోర్డు సమావేశం ముందు పెట్టనున్నారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలు దీనికి ఏమేరకు సమ్మతి తెలుపుతాయన్నది ప్రశ్నార్థకంగా ఉంది. ఈ నెల 14 నుంచి గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలులోకి రానున్న నేపథ్యంలో ఉపసంఘం ముసాయిదా ప్రాధాన్యం సంతరించుకొంది.

ముఖ్యాంశాలు ఇవీ

‘‘కృష్ణా బేసిన్‌లో 12 ప్రాజెక్టులు, వాటికి అనుబంధంగా ఉన్న వాటి నుంచి 65 కేంద్రాలను గెజిట్‌ నోటిఫికేషన్‌లోని రెండో షెడ్యూలులో చేర్చారు. ఇవన్నీ బోర్డు నిర్వహణలో ఉంటాయి. అయితే ఇందులో రెండు అసలు లేకపోగా, రెండు పునరుక్తి అయ్యాయి. ఒకటి కర్ణాటకలో ఉంది. మిగిలిన 60లోనూ 50 మాత్రమే నిర్వహణలో ఉన్నాయి. ఇందులో 21 ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా, 22 తెలంగాణలో ఉన్నాయి. ఏడు మాత్రమే ఉమ్మడిగా ఉన్నాయి. నోటిఫికేషన్‌ ప్రకారం ఈ 50 కేంద్రాలను బోర్డుకు స్వాధీనం చేయాల్సి ఉంది. అయితే కొన్నింటిపై రెండు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు లేఖలు రాశాయి. ఇవి పోనూ 29 కేంద్రాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిని మొదటి దశలో ప్రాధాన్యంగా భావించి స్వాధీనం చేసుకోవచ్చు. మిగిలినవి తర్వాత దశలో తీసుకోవచ్చు’’ అని ఉపసంఘం పేర్కొంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి తుంగభద్ర బోర్డు పద్ధతినే ఇక్కడ అమలు చేయాలని సూచించింది. రెండు రాష్ట్రాలు సీడ్‌మనీని ఈ నెల 14వ తేదీకల్లా బోర్డుకు జమ చేయాలని కూడా ముసాయిదా పేర్కొంది. మొదటి దశలో బోర్డు నిర్వహణలోకి తీసుకోవాలని సూచించినవాటిలో శ్రీశైలంకింద ఏడు ఉన్నాయి. అయిదు ఆంధ్రప్రదేశ్‌, రెండు తెలంగాణ చేతిలో ఉన్నాయి.

ఇదీచూడండి: KRMB, GRMB: ప్రాజెక్టుల స్వాధీనం సాధ్యమేనా? తెలుగు రాష్ట్రాలు అంగీకరించేనా?

Last Updated : Oct 10, 2021, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.