ETV Bharat / bharat

మహిళా రిజర్వేషన్​ను తక్షణమే అమలు చేయాలని పిల్​- అలా చేయడం కష్టమన్న సుప్రీంకోర్టు

author img

By PTI

Published : Nov 3, 2023, 3:13 PM IST

Updated : Nov 3, 2023, 3:35 PM IST

Women Reservation Bill Supreme Court : జనగణన తర్వాత మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమల్లోకి వస్తుందనే భాగాన్ని కొట్టివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మహిళా బిల్లును వెంటనే అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్‌ నాయకురాలు జయా ఠాకూర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రానికి నోటీసులు జారీ చేసేందుకు సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. మరోవైపు.. రాజ్యసభ ఛైర్మన్​కు ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా క్షమాపణలు చెప్పాలని ఓ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం సూచించింది.​

women reservation bill supreme court
women reservation bill supreme court

Women Reservation Bill Supreme Court : జనగణన తర్వాత మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమల్లోకి వస్తుందనే భాగాన్ని కొట్టివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అది చాలా కష్టమైన విషయమని పేర్కొంది. మహిళా బిల్లును వెంటనే అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్‌ నాయకురాలు జయాఠాకూర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రానికి నోటీసులు జారీ చేసేందుకు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ SVN భట్టితో కూడిన ధర్మాసనం నిరాకరించింది. ఇప్పటికే తమ వద్ద ఓ పిటిషన్‌ పెండింగ్‌లో ఉందని.. ఈనెల 22న దానితోపాటు జయ వ్యాజ్యాన్ని కలిపి విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం తెలిపింది.

జనగణన తర్వాత మహిళా రిజర్వేషన్​ను అమలు చేస్తామంటూ చట్టంలో పేర్కొన్న భాగాన్ని కొట్టివేయాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోరగా.. ఆ విధంగా చేయటం తమకు కష్టమైనపనిగా ధర్మాసనం పేర్కొంది. కనీసం కేంద్రానికి నోటీసులైనా జారీ చేయాలని న్యాయవాది కోరారు. ఈ పిటిషన్‌ను కొట్టివేయటం లేదని, అలాగని కేంద్రానికి నోటీసులు జారీ చేయలేమన్న ధర్మాసనం.. ఈ వ్యాజ్యాన్ని పెండింగ్‌లో మాత్రమే ఉంచుతున్నట్లు పేర్కొంది.

Nari Shakti Vandana Adhiniyam 2023 : మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సెప్టెంబరు 20న లోక్​సభలో ప్రవేశపెట్టగా ఇద్దరు ఎంఐఎం ఎంపీలు మినహా అందరూ మద్దతు పలికారు. బిల్లుపై లోక్​సభలో అదేరోజు 8 గంటల సుదీర్ఘ చర్చ జరిగింది. ఓటింగ్​లో మొత్తం 454 మంది పాల్గొన్నారు. 452 మంది మద్దతు పలకగా.. రెండు ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. బిల్లుపై విపక్షాలు పలు సవరణలు ప్రవేశపెట్టగా.. అవన్నీ వీగిపోయాయి. అలాగే రాజ్యసభలో సెప్టెంబర్ 21న ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. రాజ్యసభలో ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో చేపట్టిన ఓటింగ్​లో.. ఈ సభ్యులంతా ఏకగ్రీవంగా బిల్లుకు మద్దతు పలుకుతూ ఓటేశారు. సభలోని మొత్తం 215 మంది అనుకూలంగా ఓటేశారు. తద్వారా మూడు దశాబ్దాల మహిళా నిరీక్షణకు తెరపడినట్లైంది. మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వ్ చేసే ఈ బిల్లు 27 ఏళ్ల పాటు.. పార్లమెంట్​ గడప దాటేందుకు ఎదురుచూస్తూ వచ్చింది. ప్రధాన మంత్రులుగా పనిచేసిన దేవెగౌడ, వాజ్​పేయీ, పీవీ, మన్మోహన్ వంటివారు ఈ బిల్లును ఆమోదింపజేసేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ.. అవన్నీ విఫలమయ్యాయి.

'రాజ్యసభ ఛైర్మన్​కు క్షమాపణలు చెప్పండి'
Raghav Chadha Supreme Court : రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌కు బేషరతు క్షమాపణ చెప్పాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చడ్డాకు సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కీలక సూచన చేసింది. దిల్లీ సర్వీసెస్‌ బిల్లును పరిశీలించే సెలెక్ట్‌ కమిటీలో కొంతమంది ఎంపీల పేర్లను అనుమతి లేకుండానే చేర్చారనే ఆరోపణలతో ఆప్‌ ఎంపీపై రాజ్యసభ నిరవధిక సస్పెన్షన్‌ విధించింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చడ్డా దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

రాఘవ్‌ చడ్డా రాజ్యసభ ఛైర్మన్‌కు క్షమాపణ చెప్పాలని.. ఆప్‌ ఎంపీ క్షమాపణలను జగ్​దీప్ ధన్​ఖడ్​ సానుభూతితో పరిగణనలోకి తీసుకుని, వివాద పరిష్కారానికి చొరవ చూపుతారని ఆకాంక్షిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. చడ్డా పిటిషన్‌పై దీపావళి సెలవుల తర్వాత తదుపరి విచారణ చేపడతామని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ మధ్యలో జరిగే పరిణామాలను తమకు తెలియజేయాలని అటార్నీ జనరల్‌ వెంకట రమణిని కోరింది.

Women Reservation Bill President : మహిళా రిజర్వేషన్లకు రాష్ట్రపతి గ్రీన్​సిగ్నల్.. చట్టంగా మారిన బిల్లు.. కేంద్రం గెజిట్

Modi Speech Today In Bjp Office : 'మెజారిటీ ప్రభుత్వంతోనే దేశాభివృద్ధి.. మహిళా బిల్లే అందుకు సాక్ష్యం'

Last Updated :Nov 3, 2023, 3:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.