ETV Bharat / bharat

నిన్న విమర్శలు.. నేడు కలిసి తీర్థయాత్రలు

author img

By

Published : Nov 2, 2021, 2:50 PM IST

పంజాబ్​లో నేతల మధ్య అంతర్గత పోరు నడుస్తుండగానే అనూహ్య పరిణామం జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చన్నీ, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ కేదార్​నాథ్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. సీఎం చన్నీ సహా.. సొంత పార్టీపైనే సిద్ధూ విమర్శలు చేస్తూ పంజాబ్ కాంగ్రెస్​కు తలనొప్పులు తెస్తున్న నేపథ్యంలో ఈ యాత్ర చర్చనీయాంశమైంది.

ే్ి
ే్ి

పంజాబ్ కాంగ్రెస్​ను అంతర్గత పోరు పట్టిపీడిస్తోంది. సీఎం చరణ్​జీత్ సింగ్ చన్నీ, పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సిద్ధూ మధ్య వివాదం పార్టీకి తలనొప్పిగా మారుతోంది. ఇరువురి మధ్య ముగిసిందనుకున్న వివాదం సోమవారం మళ్లీ తెరపైకి వచ్చింది. చన్నీ ప్రకటించిన హామీలపై సిద్ధూ విమర్శల జల్లు కురిపించారు. అయితే.. వివాదం ముదురుతున్న క్రమంలో మరుసటి రోజే (మంగళవారం) ఇరువురు నేతలు కలిసి కేదార్​నాథ్ యాత్రకు వెళ్లారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ హరీశ్ చౌదరి కూడా వారి వెంటే ఉన్నారు. మాటల యుద్ధం నడుమ ఈ యాత్ర చర్చనీయాంశమైంది.

తెరపైకి మళ్లీ వివాదం..

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 11 శాతం పెంపు, గృహ రంగంలో యూనిట్‌కు రూ. 3 చొప్పున విద్యుత్ ధరలను ముఖ్యమంత్రి చన్నీ తగ్గిస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. అయితే.. ఈ ప్రకటనలపై సిద్ధూ అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ ఉచిత హామీలు కేవలం తాయిలాలేనని సొంత పార్టీపైనే విరుచుకుపడ్డారు. హామీలు నెరవేర్చడానికి డబ్బులు ఎక్కడినుంచి తెస్తారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టి గెలిచి ఏం ప్రయోజనమని అన్నారు. దేశంలో రూ. 5లక్షల కోట్ల అప్పు పెరిగిపోయిందని, ఇలా ఉచిత హామీలు ఇస్తే ప్రజలపైనే మరింత భారం పెరుగుతుందని ఎండగట్టారు. ఒకవేళ ఖజానా ఎక్కువగా ఉంటే ఉపాధ్యాయులకు రూ.50,000 వరకు ఎందుకు పెంచడం లేదని విమర్శించారు. ప్రజలు నిజాన్ని గ్రహించి, నిజమైన నాయకత్వానికి పగ్గాలు అప్పగించాలని కోరారు.

అయితే.. పంజాబ్ సీఎంగా చన్నీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి సిద్ధూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డీజీపీ, అడ్వకేట్​ జనరల్​ నియామకాలు, అవినీతి మరకలు ఉన్న వారికి మంత్రి పదవులు ఇచ్చారని ఇటీవల ఆరోపించి ఏకంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు సిద్ధూ. జాతీయ స్థాయి నాయకులు కల్పించుకుని సిద్ధూను సంతృప్తి పరిచారు. కానీ మళ్లీ సీఎంపై విమర్శలు కురిపించగా.. నేతల మధ్య ముసలం ఇంకా కొనసాగుతోందనే అనిపిస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.