ETV Bharat / bharat

PM cares: పీఎం కేర్స్‌ పథకాలపై పీకే ఎద్దేవా

author img

By

Published : May 31, 2021, 6:39 AM IST

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు పీఎం కేర్స్‌(PM cares) ద్వారా అత్యవసర సహాయం విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ మండిపడ్డారు. అత్యవసర సహాయం అందించాల్సిన సమయంలో 18 ఏళ్లు నిండే వరకు ఆగాలా..? అని ప్రశ్నించారు.

prashant kishore
ప్రశాంత్‌ కిశోర్‌

కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను దూరం చేసుకున్న బాలలకు పీఎం కేర్స్‌(PM cares) ద్వారా సహాయం చేయనున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించిన పథకాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ మండిపడ్డారు. చిన్నారులకు తక్షణ సహాయం అందించాల్సిన తరుణంలో 18 ఏళ్లు నిండే వరకు వారిని వేచి ఉండాలనడం ఏంటని ఎద్దేవా చేశారు. ట్విటర్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

"మోదీ సర్కారు మరో కొత్త ఎత్తుగడ. కొవిడ్‌ కట్టడిలో ప్రభుత్వం అసమర్థ విధానాల కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులపై కేంద్రం ప్రస్తుతం సానుభూతి ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్న చిన్నారులు.. 18 ఏళ్ల తర్వాత తమకు వచ్చే ఆర్థిక సహాయం గురించి సంతోషపడాలా?"

-- ప్రశాంత్​ కిషోర్, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త

రాజ్యాంగం కల్పించిన ఉచిత విద్య హక్కును ఇప్పుడు తమకు ప్రసాదించినందుకు పీఎం కేర్స్‌కు(PM cares) చిన్నారులు కృతజ్ఞులై ఉండాలంటూ వ్యంగ్యంగా ట్వీట్‌లో రాశారు.

కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఆర్థికంగా అండగా ఉంటామంటూ పలు పథకాలను ప్రధాని కార్యాలయం శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. వారి పేరుతో కొంత సొమ్మును ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయడం కూడా అందులో ఒకటి. కొవిడ్‌ విలయంలో అనాథలుగా మారిన బాలలకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఈ పథకాల ప్రకారం పీఎం కేర్స్‌ ద్వారా రూ.10 లక్షలు అందుతాయని కేంద్రం ప్రకటించింది. వారికి సమీపంలోని కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్లు ఇవ్వనున్నట్టు తెలిపింది. వారు ప్రయివేటు పాఠశాలలో చేరితే అందుకు అయ్యే ఫీజు, పుస్తకాలు, యూనిఫార్మ్‌ ఖర్చును పీఎం కేర్స్‌ ద్వారా చెల్లించనున్నట్లు వివరించింది.

ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద వారికి రూ.5 లక్షల విలువైన ఆరోగ్య బీమా సదుపాయం కల్పించనున్నట్లు కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. చిన్నారులకు 18 ఏళ్లు నిండే వరకు బీమా ప్రీమియంను పీఎం కేర్స్‌(PM cares) నుంచే చెల్లించనున్నట్లు వివరించింది.

ఇదీ చదవండి : 'రైతుల నిరసనల వల్ల గ్రామాల్లో కరోనా వ్యాప్తి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.