ETV Bharat / bharat

మళ్లీ కరోనా కలకలం.. సీఎంలతో ప్రధాని సమీక్ష

author img

By

Published : Apr 27, 2022, 5:38 AM IST

PM Modi
ప్రధానమంత్రి మోదీ

PM Modi meeting CMs:కరోనా వైరస్ కట్టడిపై సమీక్షించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ.. బుధవారం సమీక్ష నిర్వహించనున్నారు. వర్చువల్​గా జరగనున్న ఈ కార్యక్రమంలో వైరస్ కట్టడిపై రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. అలాగే ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను ముఖ్యమంత్రులు ప్రధానికి వివరించనున్నారు.

PM Modi meeting CMs: గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో వైరస్‌ కట్టడికి చర్యలు తీసుకుంటున్న ఆయా రాష్ట్రాలు.. కొవిడ్‌ ఆంక్షలను మళ్లీ అమలు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం సమీక్ష నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జరిగే ఈ కార్యక్రమంలో వైరస్‌ కట్టడికి రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి మోదీ చర్చించనున్నారు.

దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం మధ్యాహ్నం 12గంటలకు ప్రధాని మోదీ సమీక్ష నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రస్తుత కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ ప్రెజెంటేషన్‌ ఇవ్వనున్నారు. ఇదే సమయంలో ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను ముఖ్యమంత్రులు ప్రధానికి వివరించనున్నారు. అయితే, మే నెలలో పండుగలు ఉన్నందున ప్రతి ఒక్కరూ మాస్కులు, భౌతికదూరం వంటి కొవిడ్‌ నిబంధనలు పాటించాలని మొన్నటి 'మన్‌కీ బాత్‌' ప్రసంగంలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉంటే, గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా నిత్యం 2వేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య 15వేలు దాటాయి. దేశ రాజధాని దిల్లీలో పాజిటివిటీ రేటు గణనీయంగా పెరగడంతోపాటు ఆర్‌-విలువ ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఆంక్షలు అమలు చేసే పనిలో నిమగ్నమైన రాష్ట్రాలు.. మాస్కులు ధరించని వారికి జరిమానా విధించడం వంటి చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా నాలుగో వేవ్‌ నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాయి.

ఇదీ చదవండి: 'మోదీజీ.. దయచేసి ఇక ఆపేయండి ప్లీజ్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.