ETV Bharat / bharat

'ప్రజలకు హెచ్చరిక- మంచినీరు కాచి, తాగండి!'

author img

By

Published : Jul 18, 2021, 5:48 PM IST

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో భారీ వర్షాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో 25 మంది మృత్యువాత పడ్డారు. చెంబూరులో కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి చెందగా... విఖ్రోలి ప్రాంతంలో ఓ భవనం కూలి ఏడుగురు, మరోచోట గోడ కూలి ఒకరు చనిపోయారు. భారీ వర్షాల నేపథ్యంలో మంచినీరు కచ్చితంగా కాచి, తాగాలని సూచించింది బీఎంసీ.

Mumbai rains
ముంబయిలో భారీ వర్షాలు

ముంబయిని ముంచెత్తిన వరదలు

భారీ వర్షాలు ముంబయి నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెంబూరులో కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి చెందారు. ఇళ్లపై కొండచరియలు విరిగిపడగా.. పైకప్పులు, గోడలు కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో ఇళ్లలో నివసిస్తున్న 17మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలికి చేరుకున్న ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న 19 మందిని కాపాడారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల ధాటికి విఖ్రోలి ప్రాంతంలో ఓ భవనం కూలి ఏడుగురు మృతి చెందారు. శిథిలాల్లో మరో ముగ్గురు చిక్కుకొని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. సబర్బన్ భండప్‌లో అటవీ విభాగానికి చెందిన గోడ కూలి ఓ బాలుడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

స్తంభించిన జనజీవనం..

ముంబయిలోని బోరివలీలో వరదల ధాటికి పార్క్ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి. కుండపోత వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరగా ప్రజలు అవస్థలు పడ్డారు. జోరు వానలకు పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీవర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, సబర్బన్ రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. సోమవారం కూడా ముంబయితో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. ఇదివరకు జారీ చేసిన గ్రీన్‌ అలర్ట్‌ను రెడ్‌ అలర్ట్‌గా మార్చింది. ముంబయిలో కేవలం 6 గంటల వ్యవధిలోనే 100 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. గత 24 గంటల్లో 120 మిల్లిమీటర్ల వర్షం కురిసినట్లు ఐఎండీ తెలిపింది.

నష్ట పరిహారం..

ముంబయి చెంబుర్, విఖ్రోలిలో జరిగిన ప్రమాదాలపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి పీఎంఎన్​ఆర్​ఎఫ్​ నుంచి రూ.2లక్షలు పరిహారంగా అందిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. క్షతగాత్రులకు రూ.50 వేల సాయం అందిస్తామని తెలిపింది. మరోవైపు మహారాష్ట్ర సర్కారు మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది.

మంచినీటిపై హెచ్చరిక..

భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు చేసింది ముంబయి మహా నగర పాలక సంస్థ. మంచినీటిని కాచి, చల్లార్చిన తర్వాతే తాగాలని కోరింది. వరదలతో విద్యుత్తు పరికరాలు దెబ్బతిన్నాయని, దాంతో పంపులు, ఫిల్టర్​ ప్రక్రియ వ్యవస్థ ఆగిపోయినట్లు పేర్కొంది. అయితే.. కొద్ది గంటల్లోనే నీటి సరఫరా వ్యవస్థను పునరుద్ధరిస్తామని తెలిపింది. ఫిల్టర్​ ప్రక్రియను పునరుద్ధరించేందుకు సమయం పడుతుందని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాచిన నీటిని తాగటమే మంచిదని తెలిపారు అధికారులు.

ఇదీ చూడండి: కొండచరియలు విరిగిపడి 25 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.