MLC Kavitha Respond to Ed Notices: మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టి ఆమోదించాలనేది తమ ప్రధాన డిమాండ్ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా బిల్లుకు మాత్రం ఆమోదం లేదని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం తమ పోరాటం కొనసాగిస్తామని వివరించారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కేటాయించాలని వివరించారు. దిల్లీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసమే జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపడుతున్నామని కవిత తెలిపారు. 2014, 2018 ఎన్నికల్లోనూ బిల్లుపై బీజేపీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. బీజేపీకి 300కు పైగా ఎంపీ స్థానాలు.. ఇచ్చినా బిల్లు ఆమోదించలేదని పేర్కొన్నారు. మహిళా బిల్లుపై నోరు విప్పకుండా.. బిల్లు అంశాన్ని కోల్డ్ స్టోరేజీలో పెట్టిందని ఆరోపించారు. ఈనెల 10న మహిళా బిల్లుపై దీక్ష చేస్తామని.. మార్చి 2న పోస్టర్ రిలీజ్ చేశామని అన్నారు.
తమ దీక్షకు మద్దతిస్తూ 18 పార్టీలు ముందుకొచ్చాయని కవిత తెలిపారు. మార్చి 10న దీక్ష చేస్తామనగానే.. 9న విచారణకు రావాలని ఈడీ సమన్లు ఇచ్చిందని చెప్పారు. ధర్నాకు సంబంధించి ముందస్తు కార్యక్రమాల వల్ల 11న వస్తానని చెప్పానని వివరించారు. మహిళలను ఇంటికొచ్చి విచారించాలనే చట్టం చెబుతోందని అన్నారు. మహిళలను విచారించే విధానాలకు విరుద్ధంగా తనను విచారణకు పిలిచారని ఆరోపించారు.
నవంబర్, డిసెంబర్‌లో తెలంగాణలో ఎన్నికలు రావచ్చు: తమ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కేంద్రం లక్ష్యంగా చేసుకుందని కవిత మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలతో తమపై దాడులు చేయిస్తోందని తెలిపారు. ఈడీ, సీబీఐ, ఐటీ బెదిరింపులకు పాల్పడుతోందని విమర్శించారు. 12 నుంచి 15 మంది వరకు తమ పార్టీ నాయకులపై దాడులు చేశారని ఆక్షేపించారు. నవంబర్, డిసెంబర్‌లో తెలంగాణలో ఎన్నికలు రావచ్చని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించడం బీజేపీ విధానమని కవిత ఆరోపించారు.
ఈడీ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తాను: తమ పార్టీ నేతలను భయభ్రాంతులకు గురిచేయడమే బీజేపీ లక్ష్యమని కవిత విమర్శించారు. ఈడీ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. ఈడీ ముందుకు ధైర్యంగా వచ్చి.. విచారణ ఎదుర్కొంటానని తెలిపారు. బీఎల్ సంతోష్ సిట్ ముందుకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. సిట్ ముందుకు వచ్చేందుకు బీఎల్ సంతోష్‌కు భయమెందుకు? అని అన్నారు. బీజేపీ నాయకులు, బీజేపీలో చేరిన నేతలపై కేసులు ఉండవని దుయ్యబట్టారు. బీజేపీని ప్రశ్నించిన విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడులు, కేసులని ఆరోపించారు.
"మావైపు సత్యం, ధర్మం, న్యాయం ఉంది. ఏ విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొంటాం. మోదీ వన్ నేషన్.. వన్ ఫ్రెండ్ స్కీమ్‌ను అమలు చేస్తున్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అవుతుంది. మహిళా బిల్లు ఆందోళన అనగానే నాకు ఈడీ నోటీసులిచ్చారు. వంట గ్యాస్ ధరలపై మరొకరు గళమెత్తితే వాళ్లకు కూడా ఈడీ నోటీసులిస్తారు. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే దర్యాప్తు సంస్థలను పంపుతున్నారని" కవిత తెలిపారు.
ఇవీ చదవండి: దిల్లీ మద్యం కేసు... ఈరోజు విచారణకు రాలేనని ఈడీకి కవిత లేఖ
కవితకు పంపినవి ఈడీ సమన్లు కాదు.. మోదీ సమన్లు : కేటీఆర్
భారీగా బ్యాంక్ ఉద్యోగాలు.. జీతం రూ.5లక్షలు.. అప్లైకి మరో 5 రోజులే ఛాన్స్!