ETV Bharat / bharat

ఫ్లైట్​లో మహిళపై మూత్ర విసర్జన ఘటన.. ఎట్టకేలకు నిందితుడు అరెస్ట్​.. సారీ చెప్పిన CEO

author img

By

Published : Jan 7, 2023, 11:35 AM IST

Updated : Jan 7, 2023, 2:07 PM IST

ఎయిర్ఇండియా విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసిన ఘటనలో నిందితుడు అరెస్టయ్యాడు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న అతడిని బెంగళూరులో గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, ఈ ఘటనపై టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా సీఈవో కాంప్‌బెల్ విల్సన్ క్షమాపణలు చెప్పారు.

man-urinates-on-elderly-woman-in-plane-and-arrested
విమానంలో వృద్ధ మహిళపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్ట్​

ఎయిర్​ఇండియా విమానంలో ఓ వృద్ధ మహిళపై మూత్ర విసర్జన చేసిన ఘటనలో నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న నిందితుడు శంకర్‌ మిశ్రాను దిల్లీ పోలీసులు శనివారం ఉదయం బెంగళూరులో అరెస్టు చేశారు. ఈ కేసులో ఎయిరిండియా ఫిర్యాదు మేరకు అతడిపై దిల్లీలో కేసు నమోదైన విషయ తెలిసిందే.

గతేడాది నవంబరు 26న న్యూయార్క్‌ నుంచి దిల్లీ వచ్చిన విమానంలో బిజినెస్‌ క్లాస్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. బాధిత మహిళ టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌కు లేఖ రాయడంతో విషయం బహిర్గతమైంది. ఈ ఘటన గురించి చెప్పినా ఎయిరిండియా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె ఆరోపించింది. దీంతో ఎయిరిండియాపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నిందితుడిపై ఎయిర్‌లైన్‌ 30 రోజుల నిషేధం విధించింది.

మరోవైపు, ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి శంకర్‌ ఆచూకీ కన్పించకుండా పోయింది. ముంబయిలోని ఆయన నివాసానికి తాళం వేసి ఉంది. దీంతో దిల్లీ పోలీసులు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే అతడు బెంగళూరులో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడకు వెళ్లి శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఫోన్‌ స్విచాఫ్‌ చేసినప్పటికీ.. సోషల్‌మీడియా, క్రెడిట్ కార్డులను వినియోగించారని, దానివల్లే ఆచూకీ గుర్తించగలిగామని పోలీసులు తెలిపారు.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్‌ మిశ్రా ఈ వివాదంపై స్పందించారు. బాధితురాలికి తగిన నష్టపరిహారం చెల్లించానని, వివాదం అక్కడితో సమసిపోయిందని తెలిపారు. అయితే నష్టపరిహారం చెల్లించిన నెల రోజుల తర్వాత బాధితురాలి కుమార్తె ఆ డబ్బును తిరిగి పంపించేశారని వివరించారు. ఈ మేరకు మిశ్రా తరపు న్యాయవాదులు ఓ ప్రకటనను విడుదల చేశారు. బాధితురాలి పాడైపోయిన బ్యాగ్‌, దుస్తులను మిశ్రాకు పంపారని, ఆయన వాటిని ఉతికించి నవంబరు 30నే ఆవిడకు అందజేశారన్నారు. అమెరికా ఆర్థిక సేవల సంస్థ వెల్స్‌ ఫార్గో భారత విభాగానికి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న శంకర్‌ మిశ్రాను.. ఘటన నేపథ్యంలో సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది.

క్షమాపణలు చెప్పిన ఎయిర్​ఇండియా CEO కాంప్‌బెల్ విల్సన్..
అయితే ఈ ఘటనపై... టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా సీఈవో కాంప్‌బెల్ విల్సన్ క్షమాపణలు చెప్పారు. ఈ ఘటన తర్వాత నలుగురు క్యాబిన్ సిబ్బందితోపాటు పైలట్‌ను విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. ఇక నుంచి విమానాల్లో మద్యం అందించే విధానాన్ని సమీక్షిస్తామని వెల్లడించారు. ఇలాంటి ఘటనలపై ఫిర్యాదుల నమోదు, వాటిని పరిష్కరించడంపై దర్యాప్తు జరిపి మెరుగైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలను తేలిగ్గా తీసుకోకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటామని విల్సన్ హామీ ఇచ్చారు. ఈ ఘటనపై ఎయిరిండియా తీవ్రంగా చింతిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు తలెత్తినపుడు అవి పరిష్కారమైనా ఉన్నతాధికారులకు తెలియజేయాలని సిబ్బందిని ఇప్పటికే ఆదేశించినట్లు వెల్లడించారు. బాధ్యతాయుతమైన విమానయాన సంస్థగా... ఇలాంటి ఘటనలపై ఎలా స్పందించాలో సిబ్బందికి శిక్షణనిస్తామని స్పష్టం చేశారు.

Last Updated : Jan 7, 2023, 2:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.