ETV Bharat / bharat

'డ్రగ్స్​ కేసులో బాలీవుడ్​ను కావాలనే టార్గెట్‌ చేశారు'

author img

By

Published : Oct 22, 2021, 5:40 AM IST

మహారాష్ట్రలో డ్రగ్స్​ కేసు పలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో వివాదాస్పదమవుతోంది. తాజాగా.. షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్టులో కీలకంగా వ్యవహరించిన సమీర్‌ వాంఖడేపై రాష్ట్ర మంత్రి నవాబ్‌మాలిక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే సమీర్‌ వాంఖడే ఉద్యోగం పోతుందని.. ఆయన్ను జైలులో పెట్టేవరకు వదలనన్నారు. అయితే మంత్రి వ్యాఖ్యలను సదరు అధికారి ఖండించారు. అవన్నీ తప్పుడు ఆరోపణలేనని కొట్టిపారేశారు.

drugs case
డ్రగ్స్​ కేసు

ముంబయిలోని నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్‌ వ్యవహారంలో ఆయన సినీ పరిశ్రమను టార్గెట్‌ చేశారన్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సమీర్‌ వాంఖడే ఓ తోలుబొమ్మ మాత్రమేనని, ఆయన్ను కొందరు ఆడిస్తున్నారన్నారు. సమీర్‌పై ఎవరు ఒత్తిడి తెస్తున్నారో చెప్పాలన్నారు. ఏడాదిలో సమీర్‌ వాంఖడే ఉద్యోగం పోవడం ఖాయమన్న మాలిక్‌.. ఆయన్ను జైలులో పెట్టేవరకు వదలనన్నారు.

ఆ కేసులో వచ్చి.. ఇలానా?

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ కేసులో సమీర్‌ వాంఖడే ప్రత్యేక అధికారిగా వచ్చారని, ఆ కేసును వదిలేసి సినీ పరిశ్రమపై పడ్డారని వ్యాఖ్యానించారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తిని తప్పుడు కేసులో ఇరికించారని ఆరోపించారు. క్రూజ్‌ నౌకలో డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్నదంతా అబద్ధమని, వాట్సాప్‌ చాట్‌ ఆధారంగానే అరెస్టులు చేస్తున్నారన్నారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య తర్వాత ఎన్‌సీబీకి ప్రత్యేక అధికారిగా వాంఖడే వచ్చారని తెలిపారు. సుశాంత్‌ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించినా.. ఇప్పటివరకు అది ఆత్మహత్యో, హత్యో తేల్చలేదన్నారు. కానీ, ఆ తర్వాత ఎన్సీబీ సినీ పరిశ్రమతో ఆటలాడుకోవడం ప్రారంభించిందన్నారు. కొందరిని తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నాలు జరిగాయన్నారు.

కరోనా మహమ్మారి సమయంలో సినీ పరిశ్రమ మాల్దీవుల్లో ఉందని.. అప్పుడు సమీర్‌ వాంఖడే, ఆయన కుటుంబం మాల్దీవుల్లో, దుబాయిలో ఏం చేస్తోందని ప్రశ్నించారు. సమీర్‌ వాంఖడే సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్‌ చేశారు."ఆ సమయంలో సమీర్‌ వాంఖడేకు మాల్దీవులు, దుబాయిలో ఏం పని? ఆయన దుబాయిలో ఉన్నట్టు ఫొటోలు విడుదల చేస్తాను. మాల్దీవుల్లో వసూళ్లకు పాల్పడ్డారు" అని ఆరోపించారు. సమీర్‌ వాట్సాప్‌ చాట్స్‌ని పరిశీలిస్తే ఎన్సీబీ కేసులు ఎంత బోగస్‌వో వెల్లడవుతుందని మంత్రి వ్యాఖ్యానించారు.

'అవన్నీ తప్పుడు ఆరోపణలే..'

నవాబ్‌ మాలిక్‌ వ్యాఖ్యల్ని సమీర్‌ వాంఖడే ఖండించారు. అవన్నీ తప్పుడు ఆరోపణలేనని కొట్టిపారేశారు. డిసెంబర్‌లో తాను దుబాయిలో ఉన్నానని మంత్రి చెప్పడం అవాస్తవమని .. ఆ సమయంలో తాను ముంబయిలో ఉన్నట్టు స్పష్టంచేశారు. దోపిడీ అనే పదం అసహ్యమైందని, అధికారుల అనుమతితో తాను మాల్దీవులకు వెళ్లినట్టు చెప్పారు. ప్రభుత్వ అనుమతితోనే తన కుటుంబంతో కలిసి అక్కడకు వెళ్లినట్టు చెప్పారు. దాన్ని ఆయన దోపిడీ అనడం సరికాదన్నారు. తాను ప్రభుత్వ ఉద్యోగిననీ.. కానీ నవాబ్‌ మాలిక్‌ మంత్రి అన్నారు.

దేశానికి సేవ చేస్తున్నందుకు, డ్రగ్స్‌ నిరోధానికి నిజాయతీగా పనిచేస్తున్నందుకు నన్ను జైలులో పెట్టాలనుకుంటే.. దాన్ని స్వాగతిస్తానన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.