Lion Cub Varsha: పుట్టుకతోనే తల్లి వదిలేసింది. రెండు రోజులకే తోడబుట్టిన ఇద్దరినీ కోల్పోయింది. తల్లిపాల కోసం విలవిల్లాడింది. మాతృ ప్రేమకోసం తపించింది. ఈ క్రమంలో ఒంటరైన చిట్టి సింహం వర్షకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు ఓ జంతు సంరక్షకుడు. సమయానికి పాలు పడుతూ, పోషకాహారం అందిస్తూ సొంత బిడ్డలా చూసుకుంటున్నాడు.
అనాథైన వర్ష..
ఒడిశా భువనేశ్వర్‌లోని నందన్కణన్ జూపార్కులో ఆడ సింహం బిజిలీ, మగసింహం సామ్రాట్ల మూడో సంతానమే వర్ష. పుట్టుకతోనే ఒకటి మృతిచెందగా రెండు రోజులకు మరోటి ప్రాణాలు కోల్పోయింది. ఈ క్రమంలోనే బిజిలీ చిట్టి సింహాన్ని కూడా వదిలి వెళ్లిపోయింది. దీంతో వర్షకు సరైన పౌష్టికాహారం అందించి మనుషుల సంరక్షణలోనే పెంచాలని భావించింది జూపార్కు యాజమాన్యం. పెట్లాక్ అనే మిల్క్ పౌడర్‌ను కోల్‌కతా నుంచి తెప్పించి అందిస్తోంది.
ప్రస్తుతం జంతు సంరక్షకుడు ప్రశాంత్ గౌడ్ వద్ద హాయిగా పెరుగుతోంది వర్ష. మొదట్లో సింహం అనారోగ్యంతో ఉందని, మూడు నెలలపాటు రెండు గంటలకోసారి పాలు పట్టానని తెలిపాడు ప్రశాంత్.
కరోనా దృష్ట్యా.. వర్ష వైరస్ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పాడు ప్రశాంత్. అది పుట్టినప్పుడు కేజిన్నర బరువు ఉండగా ప్రస్తుతం 20 కిలోల బరువు పెరిగి ఆరోగ్యంగా ఉందని, ఉత్సాహంగా ఆడుకుంటోదని వివరించాడు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: చిన్నవయసులోనే సరిహద్దు దాటి.. హిందువునంటూ 15 ఏళ్లుగా..