ETV Bharat / bharat

మోస్ట్‌ వాంటెడ్‌ లిస్ట్​లో గ్యాంగ్​స్టర్ గోల్డీ బ్రార్​- ఉగ్రవాదిగా ప్రకటించిన భారత్

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 1, 2024, 10:19 PM IST

Goldy Brar Terrorist : కెనడాలో ఉంటున్న గోల్డీ బ్రార్ అనే గ్యాంగ్​స్టర్​ను ఉగ్రవాదిగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అతడికి నిషేధిత ఖలిస్థాన్​ సంస్థలతో సంబంధాలున్నాయని ఆరోపించింది. అతడిని మోస్ట్​ వాంటెడ్ లిస్ట్​లో చేర్చింది.

Goldy Brar Terrorist
Goldy Brar Terrorist

Goldy Brar Terrorist : కెనడాలో ఉంటున్న గ్యాంగ్‌స్టర్‌ సతీందర్‌ సింగ్‌ అలియాస్‌ గోల్డీ బ్రార్‌ను భారత ప్రభుత్వం ఉగ్రవాది​గా ప్రకటించింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు, అలాంటి కార్యకలాపాలను అడ్డుకునేందుకు తీసుకుంటున్న పలు చర్యల్లో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గోల్డీ బ్రార్​ను మోస్ట్‌ వాంటెడ్‌ లిస్ట్​లో చేరుస్తూ కేంద్ర హోం శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం కెనడాలో ఆశ్రయం పొందుతున్న గోల్డీ బ్రార్‌కు, నిషేధిత ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ 'బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌'తో సంబంధాలు ఉన్నాయని ఆ ప్రకటనలో పేర్కొంది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), 1967 ప్రకారం గోల్డీ బ్రార్‌ను ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్లు హోంశాఖ వెల్లడించింది.

గోల్డీ బ్రార్‌కు సీమాంతర ఉగ్రవాద సంస్థలతోపాటు పలు హత్యలతో సంబంధం ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. అతడు అతివాద భావజాలాన్ని వ్యాపింప చేయడం సహా, పలువురు జాతీయవాద అనుకూల నాయకులకు బెదిరింపు కాల్స్‌ చేసినట్లు ఆరోపణలు చేసింది. ఇదిలా ఉండగా దేశంలోని కొంతమంది ప్రముఖులను హత్య చేసేందుకు కొన్ని ముఠాలకు డ్రోన్ల ద్వారా అక్రమంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను సరఫరా చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. గోల్డీ బ్రార్ తన అనుచరులతో పంజాబ్‌ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించాలని ప్రయత్నిస్తున్నట్లు కేంద్రం భావిస్తోంది. అతడిపై ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసులు కూడా జారీ చేసినట్లు ప్రభుత్వం ఈ సందర్భంగా వివరాలు వెల్లడించింది.

అసలు ఎవరీ గోల్డీ బ్రార్‌?
గోల్డీ బ్రార్‌ పంజాబ్‌ రాష్ట్రంలోని శ్రీ ముక్త్సార్‌ సాహిబ్‌లో 1994లో జన్మించాడు. ఇతడి తండ్రి ఒక పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌. మొదటి సారిగా సిద్ధూ మూసేవాలా హత్య కేసు దర్యాప్తులో ఈ బ్రార్​ పేరు వెలుగులోకి వచ్చింది. సిద్ధూ హత్య కేసులో అరెస్ట్ అయిన లారెన్స్‌ బిష్ణోయ్‌తో ఇతడికి దగ్గరి సంబంధాలున్నాయి. ఈ హత్య గురించి గోల్డీ బ్రార్‌కు ముందే తెలుసని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతోపాటు పలువురికి బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఇతడిపై కేసులు కూడా నమోదయ్యాయి. కొన్ని హత్య కేసుల్లోనూ గోల్డీ బ్రార్‌ ప్రధాని నిందితుడిగా ఉన్నాడు.

జైలులో ఘర్షణ.. సింగర్ మూసేవాలా హత్య కేసు నిందితులు మృతి

మూసేవాలా హత్య కేసు సూత్రధారి అరెస్ట్.. కాలిఫోర్నియాలో చిక్కిన గోల్డీ బ్రార్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.