ETV Bharat / bharat

ఈ పరికరంతో బైక్​ చోరీలకు ఫుల్​స్టాప్​.. 100 కి.మీ దూరంలో ఉన్నా..

author img

By

Published : Nov 8, 2022, 5:44 PM IST

Updated : Nov 8, 2022, 5:59 PM IST

సాధారణంగా పాటలను ఆనందం కోసమో లేక ఆదర్శం కోసమో వింటాం. కానీ బిహార్​కు చెందిన ఓ యువకుడు ఓ పాటలోని పదాన్ని ఆదర్శంగా తీసుకుని ఓ పరికరాన్ని కనిపెట్టాడు. అదేంటంటే..?

gaya youth designed device for bike
gaya youth designed device for bike

భోజ్​పురీ సాంగ్​లోని ఓ పదాన్ని స్ఫూర్తిగా తీసుకున్న బిహార్​కు చెందిన ఓ యువకుడు వాహనాల చోరీ నియంత్రించేందుకు వినూత్న పరికరాన్ని తయారుచేశాడు. ఎవరైనా చోరీ చేసేందుకు ప్రయత్నిస్తే వాహనం అక్కడికక్కడే ఆగిపోయేలా పరికరాన్ని రూపొందించాడు. పొరపాటున అగ్నిప్రమాదాలు సంభవిస్తే.. ప్రాణాపాయం లేకుండా చేసేందుకూ ఈ పరికరం ఉపయోగపడుతుందని యువకుడు చెబుతున్నాడు.

.
విక్కీ తయారుచేసిన పరికరం

గయాలోని వాజిర్​గంజ్​కు చెందిన విక్కీ యాదవ్.. పలు నెలల పాటు శ్రమించి ఈ పరికరాన్ని సిద్ధం చేశాడు. వాహన చోరీల నియంత్రణలో భాగంగా కనిపెట్టిన ఈ డివైజ్​ ద్వారా బైక్​ కానీ కార్​ కానీ చోరీకి గురైతే వెంటనే అది యజమానిని అలర్ట్​ చేస్తుంది. నిరంతర శ్రమ తర్వాత ఎట్టకేలకు పరికరాన్ని తయారు చేయడంలో విజయం సాధించాడని విక్కీ పేర్కొన్నాడు. 'భజ్ రింగ్​టోన్' అంటూ సాగే భోజ్​పురీ స్టార్ కేసరి లాల్ యాదవ్​ పాటను స్ఫూర్తిగా తీసుకొని ఈ పరికరం రూపొందించినట్లు విక్కీ చెప్పాడు.

"ఎవరైనా ఈ పరికరాన్ని ఉపయోగిస్తే, అతని బైక్ లేదా కారును ఇతరులు దొంగలించడం సాధ్యం కాదు. ఈ రకమైన పరికరాన్ని సాధారణంగా ట్రక్కుల్లో ఉపయోగిస్తారు. దీని ద్వారా ఆ వాహనానికి మంటలు అంటుకుంటే.. డివైజ్​ ఆ వాహనాన్ని ఆటోమేటిక్‌గా ఆపేస్తుంది. డ్రైవర్ నిద్రపోయినా కూడా ఈ పరికరం వాహనాన్ని నిలిపివేస్తుంది. ప్రభుత్వం ఈ డివైజ్​ను ప్రోత్సహించి నాకు సహాయం చేస్తే, నేను దీన్ని మరింత అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాను."
-విక్కీ యాదవ్, డివైజ్​ రూపకర్త

బైక్ లేదా ఫోర్ వీలర్ దొంగతనానికి గురైతే ఆ సమయంలో.. వాహనంలోని డివైజ్ యజమానిని అప్రమత్తం చేస్తుంది. బైక్​ను తాకినా లేకపోతే ఎవరైనా దాన్ని తరలించేందుకు ప్రయత్నించినా.. వెంటనే యజమాని ఫోన్​కు కాల్​ వచ్చేస్తుంది. అంతే కాకుండా ఇందులోని ఆడియో డివైజ్​ ద్వారా ఆ సమయంలో వారు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా తెలుస్తుంది. పొరపాటున ఏదైనా వాహనం ఆన్​లో ఉంటే యజమాని కూర్చున్న చోటు నుంచే దాన్ని ఆఫ్​ చేసే వీలుంటుంది. 100 కిలోమీటర్ల దూరంలో కూడా ఈ పరికరం పని చేస్తుందని విక్కీ చెబుతున్నాడు. లారీ లాంటి పెద్ద వాహనాల్లో అగ్నిప్రమాదం సంభవిస్తే, లేదా దాని డ్రైవర్ నిద్రపోతే ఈ పరికరం ప్రభావవంతంగా ఉపయోగపడుతుందని అంటున్నాడు.

Last Updated :Nov 8, 2022, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.