దొంగతనం చేసిందనే అనుమానంతో ఓ మహిళను (36) ఎస్సై చితకబాదిన సంఘటన ఉత్తరాఖండ్‌లో వెలుగు చూసింది. దీంతో ఎస్సైని సస్పెండ్ చేశారు దేహ్రాదూన్ ఎస్ఎస్పీ. గత వారం మౌకంపుర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దీనిపై బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు జోగివాలా పోలీస్ చెక్‌పోస్ట్ వద్ద సోమవారం సాయంత్రం ఆందోళన చేపట్టిన క్రమంలో వెలుగులోకి వచ్చింది.
ఇదీ జరిగింది: ఉత్తర్‌ప్రదేశ్, సీతాపుర్‌కు చెందిన మంజు కుటుంబం ఉత్తరాఖండ్‌లోని మౌకంపుర్లో నివాసం ఉంటోంది. ఆమె భర్త ఇటుకల తయారీ పనిచేస్తున్నాడు. మంజు.. ఇళ్లలో పని చేస్తూ జీవనం సాగిస్తోంది. వారికి ఆరు, ఎనిమిదేళ్ల ఇద్దరు పిల్లలు ఉన్నారు. మౌకంపుర్లోని మంత్రా అపార్ట్మెంట్లో ఉండే ఇంజినీర్ దేవేంద్ర ధ్యాని ఫ్లాట్‌లో దొంగతనం జరిగింది. ధ్యాని దిల్లీకి వెళ్లి మే 14న తిరిగి వచ్చి చూడగా.. ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. నగలు, డబ్బులు కనిపించలేదు. బాధితురాలు మంజు.. ధ్యాని ఇంట్లో పని మనిషిగా చేస్తోంది. దీంతో ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తూ ధ్యాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు చేసిన క్రమంలో బాధిత మహిళను జోగివాలా పోలీస్ చెక్ పోస్ట్‌కు తీసుకెళ్లారు ఎస్సై దీపక్ గౌరోలా. ఆ తర్వాత తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత గాయపడిన బాధితురాలిని తొలుత దేహ్రాదూన్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారటం వల్ల మెరుగైన చికిత్స నిమిత్తం కొరొనేషన్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలికి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయంపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. పోలీసులు నిబంధనలు అతిక్రమించి క్రూరంగా హింసించారని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితురాలి బంధువులు ఆరోపించారు. ఐస్‌పై పడుకోబెట్టి, కరెంట్ షాక్ ఇచ్చారని పేర్కొన్నారు. బాధితురాలిని కొట్టినట్లు తేలిన క్రమంలో ఎస్సైని సస్పెండ్ చేసినట్లు ఎస్ఎస్పీ తెలిపారు. నెహ్రూ కాలనీ సర్కిల్ అధికారితో దర్యాప్తు చేపట్టామన్నారు.
భార్యపై భర్త దాడి
భార్యను చితకబాది, ముఖంపై ఇటుకరాయితో దాడి చేసిన సంఘటన ఝార్ఖండ్, రామ్‌గఢ్‌లోని భుర్కుండా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జైప్రకాశ్ నగర్‌కు చెందిన అనిల్ సోనీ.. బుధవారం ఉదయం ఇంటి తలుపులు మూసివేసి తన భార్య రింకి దేవీని చితకబాదాడు. అంతటితో ఆగకుండా ముఖంపై ఇటుకతో కొట్టాడు. బాధితురాలి ఆర్తనాదాలు విన్న చుట్టుపక్కల వారు పరుగున అక్కడికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్యపై అనిల్ చేస్తున్న దాడిని కొందరు ఫోన్లలో వీడియో తీశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చాలా రోజుల నుంచి తమ సోదరిని కొడుతున్నట్లు చెప్పాడు బాధితురాలి సోదరుడు మోహన్ సోనీ. గత మంగళవారం రాత్రి దాడి చేయగా.. భుర్కుండా పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు విడిచిపెట్టిన తర్వాత మళ్లీ దాడి చేసినట్లు చెప్పాడు.
ఇదీ చూడండి: కడుపులో 7 కేజీల కొకైన్.. విలువ రూ. 7 కోట్లకుపైనే- బ్యాగుల్లో వన్యప్రాణుల స్మగ్లింగ్
స్కూల్ ముందే అమ్మాయిల భీకర ఫైట్.. జుట్లు పట్టుకుని, పిడిగుద్దులతో..