Covid cases in India: దేశంలో కొవిడ్ మూడో దశ కొనసాగుతోంది. కొన్ని రోజుల నుంచి రోజువారీ కరోనా కేసులు మూడు లక్షలకుపైగా నమోదవుతున్నాయి. అయితే క్రితం రోజుతో పోల్చితే సోమవారం నమోదైన కేసుల్లో తగ్గుదల కనిపించింది. కొన్ని రాష్ట్రాలు, ముంబయి, దిల్లీ సహా పలు మెట్రో నగరాల్లో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. ఇది ఇలా కొనసాగితే ఫిబ్రవరి నెల మధ్య నాటికి కొవిడ్ కేసులు తగ్గుముఖం పడతాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
"ఈ ఏడాది ఫిబ్రవరి 15 నాటికి దేశంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడతాయి. కొన్ని రాష్ట్రాలు, మెట్రో నగరాల్లో కేసులు తగ్గడం ప్రారంభమైంది. టీకాలు వేయడం వల్ల మూడో దశ ప్రభావం తగ్గింది. వయోజన జనాభాలో 74 శాతం మంది పూర్తిగా టీకాలు వేశారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతోంది" అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసులు
అయితే దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. గుజరాత్లో 41, మధ్యప్రదేశ్‌లో 16 కేసులు వెలుగు చూశాయి. ఈ వేరియంట్లను బీఏ1, బీఏ2, బీఏ3గా గుర్తించారు. వీటి వల్ల ఇప్పటికే బ్రిటన్‌లో వైరస్ ఉద్ధృతంగా వ్యాపిస్తోంది.
Corona cases in India: భారత్‌లో ఒక్కరోజు వ్యవధిలో 3,06,064 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 439 మంది మరణించారు. 2,43,495 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 20.75 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 93.07గా నమోదైందని పేర్కొంది. యాక్టివ్ కేసుల సంఖ్య 241 రోజుల గరిష్ఠానికి చేరుకుందని వెల్లడించింది.
ఇదీ చూడండి: దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్.. ఒక్కరోజే 57 కేసులు