ETV Bharat / bharat

కెప్టెన్ x సిద్ధూ: పోటాపోటీ బలప్రదర్శనలు

author img

By

Published : Jul 21, 2021, 1:14 PM IST

పంజాబ్ కాంగ్రెస్​లో అమరిందర్ సింగ్, నవజోత్ సింగ్ మధ్య అభిప్రాయభేదాలు తొలగిపోలేదని తెలుస్తోంది. పీసీసీ చీఫ్​గా నియమితులైన తర్వాత పార్టీ ప్రజాప్రతినిధులతో సిద్ధూ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం 62 మంది ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. మరోవైపు, పార్టీ ఎంపీలతో సమావేశానికి అమరిందర్ సింగ్ పిలుపునిచ్చారు. దీంతో ఇరువురు తమ బలాన్ని ప్రదర్శిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

punjab congress tussle
సిద్దూ అమరిందర్ సింగ్

పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ.. ఆ పార్టీకి చెందిన 62 మంది ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్​గా నియమితులైనప్పటి నుంచి వరుస సమావేశాలు నిర్వహిస్తున్న ఆయన.. అమృత్​సర్​లోని తన నివాసంలో ఈ సమావేశం నిర్వహించారు.

Captain Sidhu tussle:
అమృత్​సర్​లోని సిద్ధూ నివాసంలో ఎమ్మెల్యేలు

మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వానికి సిద్ధూ క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ డిమాండ్ చేస్తున్న వేళ.. ఎమ్మెల్యే ప్రగత్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రే క్షమాపణలు చెప్పాలని సిద్ధూ వర్గానికి చెందిన సింగ్ పేర్కొన్నారు. 'సీఎం కూడా అనేక ప్రజా సమస్యలను పరిష్కరించలేదు.. అలాంటప్పుడు అమరిందర్ కూడా క్షమాపణలు చెప్పాలి' అని అన్నారు.

తొలగని విభేదాలు

పంజాబ్ పీసీసీ చీఫ్​గా సిద్ధూను హైకమాండ్ నియమించినప్పటికీ.. ఆ రాష్ట్ర కాంగ్రెస్​లో విభేదాలు సద్దుమణగలేదు. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తానని అమరిందర్​ సింగ్ చెప్పినా.. సిద్ధూతో విభేదాలు మాత్రం సమసిపోలేదు. పీసీసీ చీఫ్​గా నియమితులైనప్పటి నుంచి పార్టీ ఎమ్మెల్యేలతో సిద్ధూ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కీలక నేతలందరినీ కలుస్తున్నారు. ఇప్పటికే.. కేబినెట్ మంత్రి తిపాఠ్ రజిందర్ సింగ్ బజ్వా నివాసంలో 35 మంది ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖర్​ సహా సుఖిందర్ సింగ్ రంధావ, సుఖ్విందర్ సింగ్ సుఖ్ సర్కారియా, రజియా సుల్తానా, చరణ్​జిత్ సింగ్ ఛన్ని ఈ భేటీకి హాజరయ్యారు.

అంతేకాకుండా, పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ రాణా కేపీ సింగ్, మాజీ సీఎం రజిందర్ కౌర్ భట్టల్​ను కలిసి ఆశిస్సులు తీసుకున్నారు. మాజీ సీఎంను కలిసేందుకు వెళ్లిన సిద్ధూ.. అక్కడికి వంద మీటర్ల దూరంలో ఉన్న అమరిందర్​ను మాత్రం కలవకుండానే వెళ్లిపోయారు. సీఎం అపాయింట్​మెంట్ కోరినా.. స్పందన రాలేదని ఓ ఎమ్మెల్యే చెప్పారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఎంపీలతో అమరిందర్ భేటీకి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది.

'సారీ చెబితేనే'

పీసీసీ చీఫ్​గా సిద్ధూ నియామకం పట్ల అమరిందర్ అసంతృప్తితో ఉన్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ గతంలో చేసిన ట్వీట్లపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలిపాయి. ఈ విషయంలో ప్రభుత్వానికి క్షమాపణ చెబితే గానీ.. సిద్ధూను కలిసేది లేదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.