చివరి నిమిషంలో తారుమారు - ఆశ రేపారు, అంతలోనే ఉసూరుమనిపించారు

author img

By ETV Bharat Telugu Desk

Published : Nov 10, 2023, 5:27 PM IST

Updated : Nov 10, 2023, 8:40 PM IST

Telangana Assembly Elections

Candidates Change on Last Day of Nominations : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థుల జాబితాలు అయోమయం, గందరగోళానికి దారితీశాయి. పేర్లు ప్రకటించినా.. బీఫారం దక్కక కొందరు అభ్యర్థులు ఉసూరుమనగా.. మరికొందరికి అనూహ్యంగా సీటు వరించింది. నామినేషన్ల చివరి రోజు వరకు ఉత్కంఠతో విపక్ష పార్టీల రాజకీయం వేడెక్కింది. టికెట్‌పై భారీగా ఆశలు పెట్టుకున్న నాయకులు కొంత ఉద్వేగానికి గురయ్యారు. ఇన్నేళ్లు పార్టీకి చేసిన సేవలకు ఇదేనా గుర్తింపు అంటూ మనోవేదనతో రెబల్స్‌గా, ఇతర పార్టీల నుంచి బరిలో దిగారు.

చివరి నిమిషంలో తారుమారు - ఆశ రేపారు, అంతలోనే ఉసూరుమనిపించారు

Candidates Change on Last Day of Nominations : నామపత్రాల దాఖలు ఆఖరి రోజున రాజకీయాలు ఉత్కంఠ రేపాయి. కాంగ్రెస్‌, బీజేపీ తుది జాబితాలు పార్టీ శ్రేణుల్లో గందరగోళానికి దారితీశాయి. హస్తం పార్టీ తుది బాబితాలో పటాన్‌చెరులో తొలుత ప్రకటించిన నీలం మధు ముదిరాజ్ అభ్యర్థిత్వాన్ని మార్చి కాట శ్రీనివాస్‌గౌడ్‌కు కేటాయించారు. అంతకుముందు నీలం మధుకు ఇవ్వడాన్ని కాట శ్రీనివాస్‌ అనుచరులు జీర్ణించుకోలేక.. గాంధీభవన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఒత్తిడికి తలొగ్గిన అధిష్ఠానం కాట శ్రీనివాస్‌ వైపే మొగ్గుచూపి పార్టీ బీఫాం ఇచ్చింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

Telangana Assembly Elections 2023 : చివరి వరకు ఉత్కంఠ రేపిన సూర్యాపేట, తుంగతుర్తి స్థానాలకు అభ్యర్థుల ప్రకటనతో ఆశావహులు భగ్గుమన్నారు. సూర్యాపేట టికెట్‌ ఆశించిన పటేల్‌ రమేష్‌రెడ్డిని కాదని సీనియర్‌ నేత, మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డికే అభ్యర్థిత్వం కట్టబెట్టారు. రమేష్‌రెడ్డి సహా కుటుంబసభ్యులు కంటతడి పెట్టారు. ఐదేళ్లుగా పార్టీకి చేసిన సేవలను అధిష్ఠానం గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ అధిష్ఠానం నారాయణఖేడ్‌ అభ్యర్ధిని మార్పు చేసింది. సురేష్‌ షెట్కార్‌ స్థానంలో చివరి నిమిషంలో సంజీవ్‌ రెడ్డిని ప్రకటించింది. మొదటి నుంచి సంజీవరెడ్డికే అభ్యర్థిత్వం వస్తుందని ప్రచారం జరిగినా... జాబితాలో మాత్రం సురేష్‌ షెట్కర్‌ పేరు వచ్చింది. సంజీవ్‌ రెడ్డి వర్గం సహాయ నిరాకరణకు దిగింది. రంగంలోకి దిగిన ఏఐసీసీ దూత వేణుగోపాల్‌ ఇద్దరి నేతల మధ్య సయోధ్య కుదిర్చారు.

Congress Changed Candidates : కాంగ్రెస్‌ గెలుపునకు సమన్వయంతో పని చేయాలని సూచనతో రాజీకి వచ్చారు. ఎంపీగా పోటీ చేసేందుకు సురేష్‌ షెట్కర్‌ అంగీకరించగా.. సంజీవ్‌ రెడ్డికి టికెట్‌ ఖరారు చేసి బీఫాం ఇచ్చారు. అంతకుముందు జాబితాలో వనపర్తి నుంచి చిన్నారెడ్డి పేరు ప్రకటించినా.. ఆ తర్వాత వెలువడిన జాబితాలో మేఘారెడ్డికి అభ్యర్థిత్వం కట్టబెట్టారు. బోథ్‌లో అశోక్‌ పేరు ఖరారు చేశారు. ఆ తర్వాత మాత్రం ఆడే గజేందర్‌కు కేటాయించారు.

తెలంగాణలో 119 శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు వీరే

BJP Changed Candidates : బీజేపీ తుది అభ్యర్థుల జాబితాలోనూ తీవ్ర గందరగోళం నెలకొంది. మరో రెండు గంటలైతే నామినేషన్ దాఖలుకు సమయం ముగుస్తుందనే వరకు అభ్యర్థుల పేర్లను మార్చుతూ వచ్చింది. జాబితాలో పేరున్న వ్యక్తికి కాకుండా మరొకరికి బీఫాం ఇచ్చారు. 14 మందితో ఆఖరి జాబితాను కమలం పార్టీ ప్రకటించగా వనపర్తి, బెల్లంపల్లి, చాంద్రాయణగుట్ట స్థానాలకు అభ్యర్థులను మార్చింది.

బెల్లంపల్లిలో శ్రీదేవి స్థానంలో ఏమాజి, వనపర్తి నుంచి అశ్వద్ధామ రెడ్డి బదులు అనుజ్ఞా రెడ్డి, చాంద్రాయణగుట్ట సత్యనారాయణ ముదిరాజ్ స్థానంలో మహేందర్ పేర్లను ప్రకటించింది. గంటసేపటికే బెల్లంపల్లి అభ్యర్థి శ్రీదేవి, తుది జాబితాలో ప్రకటించిన అలంపూర్ మారియమ్మ స్థానంలో రాజ్ గోపాల్‌ను కిషన్ రెడ్డి ప్రకటించారు. అకస్మాత్తు పరిణామాలతో పార్టీ శ్రేణులు కంగుతిన్నాయి.

జాబితాలో తమ పేరు ఉందనే సంతోషించేలోపే పేర్ల మార్పుతో నాయకులు అయోమయంలో పడ్డారు. కంటోన్మెంట్ స్థానంలో టిక్కెట్‌ తనకే దక్కుతుందని మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్‌ భావించినా.. చివరి జాబితాలో మాత్రం గణేష్ నారాయణ్‌కు అభ్యర్థిత్వం దక్కింది. కంటోన్మెంట్ బీజేపీ టికెట్ ఆశించిన రజనీ దేవి, నాయుడు ప్రకాష్, విజయరామరావులు కంటోన్మెంట్ ఎన్నికల అధికారి కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

తుది జాబితాలో వేములవాడ అభ్యర్థిగా తుల ఉమను ప్రకటించిన అధిష్టానం బీ ఫామ్ మాత్రం చెన్నమనేని వికాస్‌రావ్‌కు ఇచ్చింది. సంగారెడ్డి అభ్యర్థిగా తొలుత దేశ్ పాండేను ప్రకటించింది. టికెట్ ఇచ్చారని ఆనందంతో నామినేషన్‌ వేసేందుకు బయలుదేరగా అనూహ్యంగా పార్టీ భీఫాం మాత్రం పులి మామిడి రాజుకు దక్కింది. పార్టీ తీరు పట్ల తుల ఉమ, దేశ్ పాండే ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఫాం ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ దేశ్‌పాండే హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఫోన్‌ చేసి ఆవేదన వ్యక్తం చేశారు.

వేములవాడ టికెట్‌ ఆశించిన తుల ఉమ సైతం ఇచ్చినట్లే ఇచ్చి పార్టీ తీరని అన్యాయం చేసిందని వాపోయారు. ఇన్నేళ్లు కష్టపడితే దక్కే ఫలితం ఇదేనా అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. ఒకానొకదశలో పార్టీ తీరుపై కంటతడి పెట్టారు. సూర్యాపేట కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ పటేల్‌ రమేష్‌రెడ్డి ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పటాన్‌చెరు బీఎస్పీ బీఫారం తీసుకుని నీలం మధు ముదిరాజ్‌ బరిలో దిగారు. సంగారెడ్డి బీజేపీ టికెట్‌ ఆశించిన దేశ్‌పాండే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు.

సరిహద్దులపైనే అందరి ఫోకస్- ఈసారి పొలిమేరలో ఎవరిదో కేక

Last Updated :Nov 10, 2023, 8:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.