ETV Bharat / bharat

"రాబడి పెరగట్లేదు.. అప్పులు తీరట్లేదు".. కాగ్‌ హెచ్చరిస్తున్నా దిద్దుబాటు చర్యల్లేవు

author img

By

Published : Mar 27, 2023, 7:17 AM IST

CAG WARING ABOUT THE AP DEBTS: ఆంధ్రప్రదేశ్​ అప్పులపై, వాటిని రాష్ట్రం చెల్లించే సామర్థ్యం, వ్యూహాలపై కాగ్‌ నివేదిక రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉంది. కానీ ప్రభుత్వం పట్టించుకుంటున్న పరిస్థితి కనబడటం లేదు. లెక్కకు మిక్కిలిగా అప్పులు చేయడమే కాకుండా బడ్జెట్‌ పత్రాల్లో చూపని భారాలెన్నో రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నాయని.. రెండేళ్ల తన పరిశీలనలో తేల్చిచెప్పింది. ఈ రెండు నివేదికల్లో కాగ్‌ ఏం చెప్పింది? ఏం సలహాలు ఇచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం వాటిని పాటిస్తోందా? అప్పుల భారం నుంచి బయటపడి అభివృద్ధి మార్గం వైపు పయనించే చర్యలు ఏమైనా చేపట్టిందా అంటే.. అటువంటి పరిస్థితి లేనేలేదని తేటతెల్లమవుతుంది.

CAG WARING ABOUT THE AP DEBTS
CAG WARING ABOUT THE AP DEBTS

"రాబడి పెరగట్లేదు.. అప్పులు తీరట్లేదు".. కాగ్‌ హెచ్చరిస్తున్నా దిద్దుబాటు చర్యల్లేవు

CAG WARING ABOUT THE AP DEBTS: రాష్ట్రం 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 మధ్య కాలంలో 3లక్షల 47వేల 944.64 కోట్ల రూపాయల మేర ప్రభుత్వం రుణం చెల్లించాల్సి రావచ్చని.. 2022 మార్చి 31 నాటికి GSDPలో రుణాలు 31 శాతమే ఉన్నట్లు ప్రభుత్వం చూపుతున్నా.. రాష్ట్ర రుణ భారం అంతకంటే ఎక్కువే ఉందని కాగ్‌ తెలిపింది. బడ్జెటేతర రుణాలను ఇతర నిబద్ధ బాధ్యతలను కూడా లెక్కలోకి తీసుకుంటే GSDPలో రుణాల శాతం 42.33 శాతమని.. ఇది నిర్దేశిత పరిమితి కన్నా ఏకంగా 6.73 శాతం అదనమని స్పష్టం చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరం తర్వాత పరిస్థితి కొంత కుదుటపడే అవకాశం ఉందని.. ఐతే ఆదాయాలు పెంచుకోకుండా ప్రతీ సంవత్సరం ఖర్చుల కోసం కూడా అప్పుల పైనే ఆధారపడితే రుణ బాధ్యత సరళి మరింత పెరిగే ప్రమాదమూ లేకపోలేదని హెచ్చరించింది.

తాజా బడ్జెట్‌లో చూపిన లెక్కలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్న కాగ్‌ వాటిని తీర్చే విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది. బడ్జెటేతర రుణాలను కూడా కలిపి GSDPలో 42.33 శాతంగా కాగ్‌ పేర్కొంటోంది. వివిధ కార్పొరేషన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న రుణాలను పూర్తి స్థాయిలో వెల్లడించడం లేదు. ఆయా కార్పొరేషన్ల లెక్కలపై ఆడిట్‌ చేయించి కంపెనీల రిజిస్ట్రార్‌ వద్ద చెప్పకపోవడంతో వాటి అసలు అప్పులు బయటపడటం లేదు.

కార్పొరేషన్లు తమ ఆడిట్‌ నివేదికలు సమర్పించి చాలా కాలం అయిందని కూడా కాగ్‌ నివేదికలో ప్రస్తావించింది. నీటిపారుదల ప్రాజెక్టులు, డిస్కంలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు, ఇతర పథకాలకు ఉన్న పెండింగ్‌ బిల్లులను బడ్జెట్‌ లెక్కల్లో ప్రభుత్వం చూపడం లేదనీ తప్పు పట్టింది. ప్రభుత్వం చెబుతున్న అప్పుల లెక్కలన్నీ అవాస్తవమే అని, అన్ని అప్పుల గురించీ వెల్లడిస్తున్నామన్న ప్రకటనలూ నిజం కాదంటూ కాగ్​ కొట్టిపారేసింది.

ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా.. ఏడు, ఆరు సంవత్సరాల వ్యవధిలో తిరిగి చెల్లిస్తామని బహిరంగ మార్కెట్‌ రుణాలు తీసుకుంటోంది. అంటే రాబోయే పది సంవత్సరాల కాలంలో చెల్లించాల్సిన అప్పులు ఇప్పటికే చాలా పెరిగిపోయాయి. ఇలాగే అప్పులు చేసుకుంటూ పోతే ప్రమాదమేనన్న కాగ్‌ హెచ్చరికలను ఇది పెడచెవిన పెట్టడమే. కార్పొరేషన్ల రుణాలు, వాటిపై వడ్డీలను ప్రభుత్వమే తన బడ్జెట్‌ నుంచి చెల్లిస్తోంది. ఆ మొత్తాలు కలిపి లెక్కిస్తే భారం ఇంకెంత ఉందో పూర్తిస్థాయిలో తెలుస్తుంది.

పెరుగుతున్న రుణ భారాన్ని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం అదనపు రెవెన్యూ వనరులు సమకూర్చుకునేలా చూడటంతో పాటు ఒక వివేచనాత్మక రుణ వ్యూహాన్ని రూపొందించుకోవాలని కాగ్‌ సూచించింది. దీనికి ఓ నిర్దిష్ట ప్రణాళిక లేకపోతే అభివృద్ధి కార్యకలాపాల కోసం మిగిలే వనరులు తగ్గిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ అప్పులు మూలధన ఆస్తుల సృష్టి అంటే అభివృద్ధికి కాకుండా రుణ విమోచనకే ఖర్చు చేస్తున్నట్లు స్పష్టమవుతోందని తేల్చింది. సేకరించిన రుణాలను స్థిరాస్తుల సృష్టికి వినియోగించి ఆదాయ వనరులు పెంచుకోకుండా ఇలా రుణాల చెల్లింపులకే వినియోగించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పెరుగుతుందని.... అంతిమంగా రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకునే ప్రమాదం లేకపోలేదని కాగ్‌ వెల్లడించింది.

కాగ్‌ సూచనలను పట్టించుకోని ప్రభుత్వం.... అదనపు రెవెన్యూ వనరులు సమకూర్చుకునే ప్రయత్నం కాదు కదా... ఆ దిశగా ఆలోచిస్తున్న దాఖలాలు కూడా లేవు. ఇటీవలి ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వం ఆశించినట్లుగా సొంత రాబడులు ఉండటం లేదు. సాధారణంగా ప్రతీ సంవత్సరం 15 నుంచి 20 శాతం రాబడులు పెరుగుతాయి. అది పెద్ద పెరుగుదల కాదని, ద్రవ్యోల్బణానికి తగ్గట్టుగా ఉంటుందని నిపుణుల విశ్లేషిస్తున్నారు. పెరుగుదల రేటులోనూ ఆశావహ వాతావరణం కనిపించడం లేదు. అలాగే కొత్తగా ఆస్తులు సృష్టించగలిగితేనే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు పెరిగే ఆస్కారం ఉంది.

రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు విస్తృతంగా సాగితేనే రాబడులు పెరుగుతాయి. అభివృద్ధి పనులకే నిధులు ఖర్చు చేయనప్పుడు, ఆస్తులు సృష్టించేలా నిధులు వెచ్చించనప్పుడు రాష్ట్ర రాబడులు ఎక్కడ పెరుగుతాయనే ప్రశ్న తలెత్తుతోంది. రాబడి పెరగాలంటే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి కావాలంటే మూలధన వ్యయం రూపంలో ఎక్కువ మొత్తాలు కేటాయించి, ఖర్చు చేయాలి. సగటున ప్రతి రాష్ట్రంలో మూలధన వ్యయం 14.41 శాతంగా ఉంటే ఏపీలో అది 9.21 శాతమే ఉందని కాగ్‌ కుండబద్దలు కొట్టింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 7.04 శాతమే మూలధన వ్యయంపై ఖర్చు చేసింది.

2020-21 ఆర్థిక సంవత్సరంలో 10.14 శాతానికి పెరిగినా తర్వాత సంవత్సరం అది 8.5 శాతానికి పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నెల చివరి వరకు అత్యంత దారుణంగా కేవలం 4.10 శాతమే మూలధన వ్యయం కింద రాష్ట్రం ఖర్చు చేసినట్లు కాగ్‌ నివేదికలో స్పష్టం అవుతున్నాయి. అయితే ఇందులోనూ కొంత పేదలకు ఇచ్చే ఇళ్ల పథకాలపై వెచ్చించి, దాన్నీ మూల ధన వ్యయంగా చూపే ప్రయత్నాలు జరిగాయని కాగ్‌ గతంలోనే తప్పు పట్టింది.

అప్పులు తెచ్చి రెవెన్యూ ఖర్చులు చేస్తూ, అప్పులతో మళ్లీ అప్పులు తీరుస్తూ, ఉన్న బడ్జెట్‌ నుంచి ఆస్తులు సృష్టించేందుకు చాలినన్ని నిధులివ్వకపోతే.... ఇక రాష్ట్రం అప్పులు తీరేదెలా? అభివృద్ధి జరిగేదెలా?. ఆస్తుల కల్పన కోసం ఆర్థికాభివృద్ధిని వేగిరపరచాలని... ఇందుకు అవసరమైన నిధులు వెచ్చించాలని.... కాగ్‌ సూచించింది. ప్రాజెక్టుల అమలును నిశితంగా పరిశీలించాలన్న కాగ్‌... నీటిపారుదల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలంది. అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణమే కీలకమని కాగ్‌ స్పష్టంచేసింది. అప్పుల నుంచి బయటపడాలన్నా, రాబడులు పెరగాలన్నా ప్రాజెక్టులు ఎంతో కీలకమని చెప్పినా.... ఏపీలో నాలుగేళ్లుగా నీటిపారుదల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు.

కీలకమైన ప్రాజెక్టులను పూర్తి చేయకపోగా... కొత్త ఆయకట్టును సాగులోకి తీసుకురాలేదు. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు చాలినన్ని నిధులూ ఇవ్వడం లేదు.రాష్ట్రంలో మొత్తం 54 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని, 2024 నాటికి వాటిలో 42 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ నాలుగు సంవత్సరాలలో కేవలం రెండు ప్రాజెక్టుల నిర్మాణాన్ని మాత్రమే ప్రభుత్వం కొలిక్కి తీసుకువచ్చింది. మిగిలిన ప్రాజెక్టులు వచ్చే సంవత్సరంలో కూడా పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. మొత్తం ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే 1లక్షా 64వేల 815 కోట్ల రూపాయలు అవసరమని లెక్కించారు. ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రభుత్వం వీటిపై ఖర్చు చేసింది 20 వేల కోట్ల లోపే. దీంతో కీలక ప్రాజెక్టులు పూర్తి చేసే ఆస్కారమే లేదు. ఫలితంగా కాగ్‌ చెప్పినట్లు అభివృద్ధి అంతంతమాత్రం అవుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.