Boyfriend Attacked Girlfriend Maharashtra : మహారాష్ట్రలోని ముంబయికి చెందిన ప్రియాసింగ్ అనే 26ఏళ్ల యువతి తనపై సీనియర్ ప్రభుత్వాధికారి తనయుడు, అతని స్నేహితులతో కలిసి దాడిచేసినట్లు ఆరోపించింది. సోషల్ మీడియా వేదికగా తనకు న్యాయం చేయాలని కోరింది. ఠాణెలోని ఓ హోటల్ సమీపంలో దాడి ఘటన జరిగినట్లు తెలిపింది. ఈ ఘటనపై మహారాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ అనిల్ గైక్వాడ్ కుమారుడు అశ్వజిత్ గైక్వాడ్‌తోపాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
'కాపాడమని అడిగితే'
సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు కుటుంబ కార్యక్రమం ఉందని, దానికి హాజరుకావాలని తనతో నాలుగేళ్లుగా రిలేషన్‌లో ఉన్న గైక్వాడ్ ఫోన్ చేయడం వల్ల వెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. ఆ కార్యక్రమంలో గైక్వాడ్ ప్రవర్తన కొత్తగా ఉండడం వల్ల ఏమైందని ప్రశ్నించినట్లు పేర్కొంది. ఏకాంతంగా మాట్లాడాలంటూ పట్టుపట్టగా హోటల్ బయటికి వచ్చినట్లు తెలిపింది. కొంతసేపటి తర్వాత గైక్వాడ్‌తోపాటు అక్కడికి వచ్చిన అతని స్నేహితులు తనను దుర్భాషలాడటం మొదలుపెట్టారని బాధితురాలు చెప్పింది. కాపాడమని గైక్వాడ్‌ను కోరగా అతను కూడా తనపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడని ప్రియాసింగ్ ఆరోపించింది.
'నడవలేని స్థితిలో ఉన్నాను'
గైక్వాడ్ దాడితో ఒక్కసారిగా భయానికి లోనైన తాను వారిని దూరంగా నెట్టడానికి ప్రయత్నించగా నిందితుడు అతని స్నేహితులతో కలిసి తనను బలంగా కింద పడేశాడని ప్రియ తెలిపింది. అంతేకాకుండా కారులోని వస్తువులు తీసుకొవడానికి వెళ్లిన తనపై నిందితుడు అతని డ్రైవర్‌తో దాడిచేయించి తీవ్రంగా గాయపరిచాడని వాపోయింది. ఈ దాడిలో తన కుడికాలు విరగటమే కాకుండా తీవ్రగాయాలు అయ్యాయని, ప్రస్తుతం నడవలేనిస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు బాధితురాలు పేర్కొంది. ఈ ఘటనపై విచారణ జరుగుతుందని ఇప్పటివరకూ ఎవరిని అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.
"అశ్వజిత్ గైక్వాడ్, నేను గత నాలుగున్నరేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. అతడికి ముందే వివాహం జరిగిందన్న విషయం నాకు అస్సలు తెలియదు. కొద్దిరోజుల తర్వాత ఆ విషయం తెలిసింది. దీనిపై అతణ్ని ప్రశ్నించగా తన భార్యతో విడాకులు తీసుకున్నారని నాతో చెప్పాడు. నన్ను పెళ్లి చేసుకుంటాని చెప్పాడు.ఈ క్రమంలో గైక్వాడ్‌ను కలిసేందుకు ఓ రోజు రాత్రి నేను బయటకు వెళ్లాను. అప్పుడు అతడు తన మొదటి భార్యతో కలిసి ఉన్నాడు. ఇది చూసి నేను షాకయ్యాను. ఇదే విషయమై అతడ్ని నిలదీయగా నాపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అతడి స్నేహితులతో కలిసి నాపై దాడి చేశాడు."
- ప్రియాసింగ్, బాధితురాలు
అయోధ్య రామ మందిరం ఓపెనింగ్‌కు 1000 ప్రత్యేక రైళ్లు- ఎప్పట్నుంచంటే?
'ఒంటికి నిప్పంటించుకోవాలని నిందితుల ప్లాన్'- పార్లమెంట్ ఘటనలో విస్తుపోయే నిజాలు