సామాజిక మాధ్యమాల ఖాతాలతో పౌరుల ఆధార్ సంఖ్యను అనుసంధానించే ప్రణాళికలేవీ ప్రభుత్వం వద్ద లేవని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. భారత ప్రజల ఆధార్ డేటా సురక్షితంగా ఉందని.. దాన్ని తరచూ ఆడిటింగ్ చేస్తున్నట్లు పార్లమెంటులో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
ఐటీ చట్టం-2000 లోని సెక్షన్ 69ఏ ప్రకారం ప్రజా ప్రయోజనం కోసం కొన్ని ఖాతాలను బ్లాక్ చేసే హక్కు ప్రభుత్వానికి ఉందని వెల్లడించారు కేంద్ర మంత్రి.
ఇటీవల ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్ పెగాసస్ భారత జర్నలిస్టులు, మానవహక్కుల ఉద్యమకారుల ఫోన్లలోకి చొరబడిన వ్యవహారంలో ఏ చర్యలు తీసుకున్నారని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన రవిశంకర్ ప్రసాద్.. ఆ స్పైవేర్ భారత్‌లోని 121 మంది ఫోన్లలోకి చొరబడిందని, దీనిపై విచారణ జరిపిస్తున్నామని తెలిపారు. పౌరులకు వ్యక్తిగత గోప్యత కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. స్పైవేర్ దాడిపై ఇప్పటికే వాట్సప్ సంస్థను నివేదిక కోరామని వివరించారు.
ఇదీ చూడండి: చిట్‌ఫండ్ చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం