ETV Bharat / bharat

'జాదవ్​ను పాక్​ బలవంతంగా ఒప్పించి ఉంటుంది'

author img

By

Published : Jul 9, 2020, 5:40 AM IST

గూఢచర్యం కేసులో పాక్​లో మరణశిక్ష పడిన కుల్​భూషణ్ జాదవ్​పై పాక్ బూటకపు ప్రకటనలు చేస్తోందని భారత్ ఆరోపించింది. రివ్యూ పిటిషన్​కు నిరాకరించాలని జాదవ్​ను బలవంతంగా ఒప్పించి ఉంటారని పేర్కొంది.

MEA KULBHUSHAN
జాదవ్

మరణ శిక్ష రివ్యూ పిటిషన్​ కుల్​భుషణ్​ జాదవ్ తిరస్కరించారని పాక్ చేసిన ప్రకటనను భారత్​ తోసిపుచ్చింది. జాదవ్ తన హక్కులను వదులుకునేందుకు పాక్ బలవంతంగా చేస్తోన్న కుట్ర అని భారత విదేశాంగ శాఖ ఆరోపించింది. కుల్​భూషణ్​ విషయంలో పాక్ బూటకపు ప్రకటనలు చేస్తోందని మండిపడింది.

"తన కస్టడీలో ఉన్న జాదవ్​ రివ్యూ పిటిషన్​ను వేసేందుకు నిరాకరించాడని పాక్ నాలుగేళ్లుగా చెబుతోంది. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును అనుసరిస్తున్నామనే ముసుగులో తన దుష్ట ప్రయత్నాలు నెరవేర్చుకునేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. ​పరిష్కారం చూపిస్తున్నామనే భ్రమను కల్పిస్తోంది. జాదవ్​ను రక్షించి దేశానికి తీసుకొచ్చేందుకు భారత్​ శాయశక్తులా కృషి చేస్తుంది."

- అనురాగ్ శ్రీవాస్తవ, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

బలవంతంగా ఒప్పించారు..

ఐసీజే తీర్పును పాటిస్తున్నాం అంటూనే పాకిస్తాన్ అబద్ధాలను సృష్టించడానికి ప్రయత్నిస్తోందని అనురాగ్ ఆరోపించారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్, సాక్ష్యాలు, కోర్టు ఉత్తర్వులతో సహా సంబంధిత పత్రాలను భారత్​కు ఇవ్వడానికి పాక్ నిరాకరించిందని చెప్పారు.

"పాక్ అంతర్జాతీయ న్యాయసూత్రాలను ఉల్లంఘిస్తోందని ఇప్పటికే ఐసీజే ఆరోపించింది. గతంలో కుట్రపూరితంగా విచారించి జాదవ్​కు మరణశిక్ష విధించారు. ఇప్పటికీ ఆయన పాక్ సైన్యం కస్టడీలోనే ఉన్నారు. రివ్యూ పిటిషన్​ను దాఖలుకు నిరాకరించేలా జాదవ్​పై ఒత్తిడి చేశారని కచ్చితంగా చెప్పగలం."

- అనురాగ్ శ్రీవాస్తవ, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

కుల్​భూషణ్​ విషయంలో పాక్​పై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాలని కేంద్రాన్ని కాంగ్రెస్ కోరింది. రివ్యూ పిటిషన్​ వేసేలా ఐసీజే ద్వారా ప్రయత్నించాలని సూచించింది.

"భారత ప్రభుత్వాన్ని మేం విశ్వసిస్తున్నాం. కుల్​భూషణ్​ న్యాయ హక్కులను వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలి. ఈ విషయం ఇక్కడితో ముగిసిపోకుండా అంతర్జాతీయ సమాజాన్ని ఏకం చేయాలి."

- అభిషేక్ సింఘ్వీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

పాక్​ కిడ్నాప్​...

గూఢచర్యం ఆరోపణలతో 2016లో ఇరాన్ నుంచి జాదవ్‌ను పాక్‌ ఏజెంట్లు అపహరించారు. బలూచిస్థాన్లోకి ప్రవేశించినట్లు ఆరోపణలు మోపుతూ అరెస్టు చేశారు. 2017 ఏప్రిల్‌లో పాకిస్థాన్‌ మిలిటరీ కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. అయితే ఇరాన్‌లో ఉంటున్న జాదవ్‌ను పాక్‌ కిడ్నాప్‌ చేసిందని భారత్‌ ఆరోపించింది.

పాక్‌ విధించిన మరణశిక్షను సవాల్‌ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 2017 మే 18న జాదవ్‌ మరణశిక్షపై స్టే విధించింది. జాదవ్ గతంలో భారత నావికాదళంలో పనిచేశారు.

ఇదీ చూడండి: కుల్​భూషణ్​ జాదవ్‌పై పాక్ మరో కుట్ర!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.