ETV Bharat / international

కుల్​భూషణ్​ జాదవ్‌పై పాక్ మరో కుట్ర!

author img

By

Published : Jul 8, 2020, 7:35 PM IST

భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ విషయంలో పాకిస్థాన్ కుట్రలు పన్నుతోంది. మరణ శిక్షపై రివ్యూ పిటిషన్​ వేసేందుకు ఆయన నిరాకరించినట్లు చెబుతోంది. క్షమాభిక్ష పిటిషన్‌పైనే ముందుకు వెళ్లేందుకు జాదవ్ నిర్ణయించుకున్నట్లు తెలిపింది.

Kulbhushan refused to file plea for review of his conviction, claims Pak
కుల్​భూషణ్​ జాదవ్‌పై పాకిస్థాన్ కుట్ర!

గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటూ పాకిస్థాన్‌ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌ భూషణ్‌ జాదవ్‌ విషయంలో దాయాది దేశం కుట్రలకు తెరతీస్తున్నట్లు తెలుస్తోంది. తనకు విధించిన మరణ శిక్షపై రివ్యూ పిటిషన్‌ వేయడానికి జాదవ్‌ నిరాకరించినట్లు చెబుతోంది. దానికంటే తాను తొలుత దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌పైనే ముందుకు వెళ్లడానికి నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చింది. 'జూన్‌ 17న కుల్ భూషణ్‌ తనకు విధించిన శిక్షపై సమీక్ష కోరుతూ వ్యాజ్యం దాఖలు చేయడానికి అనుమతించాం. కానీ, ఆయన అందుకు నిరాకరించారు' అని పాక్‌ అదనపు అటార్నీ జనరల్‌ అహ్మద్‌ ఇర్ఫాన్‌ మీడియా సమావేశంలో తెలిపారు. మరోవైపు జాదవ్‌ను కలిసేందుకు రెండోసారి 'కాన్సులర్‌ యాక్సెస్‌' ఇస్తున్నట్లు పాకిస్థాన్‌ ప్రభుత్వం ప్రకటించింది.

రివ్యూ పిటిషన్ కాకుండా.. క్షమాభిక్ష పిటిషన్ కోరుతున్నారంటే కుల్‌ భూషణ్‌ తన తప్పును అంగీకరిస్తున్నట్లు అంతర్జాతీయ సమాజానికి చూపడానికే పాకిస్థాన్‌ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నట్లు అర్థమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తీర్పును సమీక్షించాలన్న అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయడంపై పాక్‌తో భారత్‌ సంప్రదింపులు జరుపుతున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.

గూఢచర్యం ఆరోపణలతో 2016లో ఇరాన్ నుంచి జాదవ్‌ను పాక్‌ ఏజెంట్లు అపహరించారు. బలూచిస్థాన్లోకి ప్రవేశించినట్లు ఆరోపణలు మోపుతూ అరెస్టు చేశారు. 2017 ఏప్రిల్‌లో పాకిస్థాన్‌ మిలిటరీ కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. అయితే ఇరాన్‌లో ఉంటున్న జాదవ్‌ను పాక్‌ కిడ్నాప్‌ చేసిందని భారత్‌ ఆరోపించింది. పాక్‌ విధించిన మరణశిక్షను సవాల్‌ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 2017 మే 18న జాదవ్‌ మరణశిక్షపై స్టే విధించింది. అనంతరం ఇరు దేశాల వాదనలు విన్న న్యాయస్థానం కేసును పున:సమీక్షించి, సరైన సాక్ష్యాధారాలు సమర్పించే వరకు ఉరిశిక్షను నిలుపుదల చేస్తున్నట్లు 2019 జులై 17న తీర్పు వెలువరించింది. కుల్‌భూషణ్ తరఫున న్యాయవాదిని నియమించుకునే హక్కు భారత్‌కు ఉందని స్పష్టం చేసింది. 16 మంది న్యాయమూర్తుల్లో 15 మంది భారత్‌కు అనుకూలంగా తీర్పు చెప్పడంతో.. అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌కు చుక్కెదురైంది. తాజాగా.. ఐసీజే ఆదేశాల ప్రకారం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయడానికి అనుమతించినా జాదవ్‌ అందుకు నిరాకరిస్తున్నారని చెప్పుకొస్తోంది.

ఇదీ చూడండి: అమెరికా 'ఏకపక్షవాదానికి' అది నిదర్శనం: చైనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.