ETV Bharat / bharat

జగదభిరాముడి కల్యాణం.. జగమంతా ఆనందం.. లోకకల్యాణానికి ఆరంభం

author img

By

Published : Mar 30, 2023, 12:56 PM IST

Updated : Mar 30, 2023, 3:16 PM IST

Bhadradri Ramayya Kalyanam : జగదానంద కారకుడు, జగదాభిరాముడు, భక్తకోటి తీరొక్క పేరుతో పిలుచుకునే భద్రాద్రి రాములోరి కల్యాణ వేడుక... కనుల పండువగా సాగింది. అభిజిత్‌ లగ్నంలో రాముడు, జగన్మాత సీతమ్మమెడలో మాంగళ్యధారణ చేశారు. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దేవదేవుడి కల్యాణవైభోగాన్ని.. కనులారా వీక్షించి భక్తజనం పులకించారు.

Etv Bharat
Etv Bharat

Bhadradri Ramayya Kalyanam : శ్రీరామనవమి రానే వచ్చింది. లోక కల్యాణంగా భావించే శ్రీ సీతారాముల కల్యాణం భద్రాద్రిలో అంగరంగవైభవంగా సాగింది. మిథిలా మైదానంలో కిక్కిరిసిన భక్తజన సందోహం మధ్య ఉదయం 10 గంటల 30 నిమిషాలకు వేదమంత్రోచ్ఛారణల నడుమ కల‌్యాణ ఘట్టం ప్రారంభమైంది. మేళతాళాలు, భక్తుల జయజయ ద్వానాల మధ్య కల్యాణమూర్తులను ఊరేగింపుగా కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. అనంతరం స్వామివారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఏఈవో తులసీప్రసాద్‌ పరివారం స్వామి వారికి పట్టువస్త్రాలు అందించారు.

Sri Rama navami at Bhadrachalam : చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో సాగిన కల్యాణ క్రతువులో తిరుకల్యాణానికి సంకల్పం పలికి సర్వవిజ్ఞాన శాంతికి.. విశ్వక్సేన ఆరాధన నిర్వహించారు. ఆ తర్వాత కల్యాణానికి ఉపయోగించే సామగ్రికి సంప్రోక్షణ తర్వాత రక్షా బంధనం నిర్వహించి యోక్ర్తధారణ చేశారు. 12 దర్బలతో ప్రత్యేకంగా అల్లిన తాడుని సీతమ్మవారి నడుముకు అలంకరించారు. యోక్ర్తధారణ చేయడం ద్వారా గర్భస్త దోషాలు తొలుగుతాయని చెబుతారు.

సీతారాములకు రక్షాబంధనం కట్టి స్వామి గృహస్త ధర్మం కోసం యజ్ఞోపవితరణ చేసి, కన్యావరుణ నిర్వహించి.. తాంబూలాది సత్కారాలు అందించారు. శ్రీరాముడికి సీతమ్మ తగిన వధువని పెద్దలు నిర్ణయించి ఇరువంశాల గోత్రాలు పఠించారు. స్వామివారి పాదప్రక్షాళన చేసి మహాదానాలు సమర్పించారు. భక్త రామదాసు సమర్పించిన పచ్చల హారం సహా పలు అభరణాలను స్వామి, అమ్మవారికి ఆలంకరించారు. కల్యాణ వైభవాన్ని చాటిచెప్పేలా చూర్ణికను పఠించిన అనంతరం వేదమంత్రోచ్చరణాలు మారుమోగుతుండగా జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచారు. ఇది శుభ ముహూర్తం. జగత్ కల్యాణ శుభసన్నివేశం. ఆ కమనీయ వేడుకను కనులారా వీక్షించి భక్తులు తన్మయత్వం పొందారు.

లోకమంతా వేయికళ్లతో ఎదురుచూసిన అభిజిత్ లగ్నంలో సీతమ్మవారి మెడలో శ్రీరామచంద్రుడు మాంగళ్యధారణ చేశారు. జగదభిరాముడు మూడుముళ్లు వేసిన క్షణాన ముల్లోకాలు మురిశాయి. లక్షలాది సంఖ్యలో తరలివచ్చిన భక్తుల రామనామస్మరణ మధ్య ఆ జగదభిరాముడు జానకమ్మను మనువాడాడు. రాముడు దోసిట తలంబ్రాలు నీలపురాసులుగా జానకి దోసిట తలంబ్రాలు మనిమాణిక్యాలై సాక్ష్యాత్కరించిన వేళ.. మిథిలా మైదానం భక్తిపారవశ్యంలో ఓలలాడింది. శ్రీరామ నవమి సందర్భంగా కల్యాణ కాంతులతో కళకళలాడిన పరంధాముడికి రేపు పుష్కర సామాజ్య పట్టాభిషేక మహోత్సవం జరగనుంది.

కన్నుల పండువగా భద్రాచల సీతారామ కల్యాణం

ఇవీ చదవండి:

Last Updated : Mar 30, 2023, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.