ETV Bharat / bharat

హిందూ- ముస్లిం ఐక్యత కోరిన వ్యక్తి.. కరడుగట్టిన ముస్లింవాదిగా..

author img

By

Published : Jul 30, 2022, 7:00 AM IST

ముస్లింలీగ్‌లో చేరటానికి చాన్నాళ్లు ఇష్టపడనివాడు.. హిందూ- ముస్లిం ఐక్యత కోసం ఒప్పందం కుదిర్చినవాడు.. ఖిలాఫత్‌ ఉద్యమాన్నీ వ్యతిరేకించినవాడు.. కరడుగట్టిన ముస్లింవాదిగా ఎలా మారిపోయాడు? ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని ఎలా వాదించాడు? పాకిస్థాన్‌ ఏర్పాటు కోసం ఎలా పట్టుబట్టాడు? ఇంతలా మారిపోయిన వ్యక్తి పేరే మహ్మద్ అలీ జిన్నా.

Muhammad Ali Jinnah
జిన్నా

కరాచీలో 1876 డిసెంబరు 25న జన్మించిన జిన్నా ముత్తాతలు హిందూమతం నుంచి ఇస్లాంలోకి మారారు. మాతృభాష గుజరాతీ! లండన్‌లో న్యాయశాస్త్ర పట్టా అందుకుని 1897లో బొంబాయి హైకోర్టులో అడ్వకేటుగా చేరాడు. లండన్‌లో పరిచయమైన దాదాభాయి నౌరోజీకి వ్యక్తిగత సహాయకుడి హోదాలో 1906 కలకత్తా కాంగ్రెస్‌ సదస్సుకు హాజరవటం ద్వారా జిన్నా క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. సరిగ్గా అదే సమయానికి ఆంగ్లేయుల మద్దతుతో ముస్లింలీగ్‌ ఏర్పాటైంది. కానీ అటువైపు ఆయన మొగ్గు చూపలేదు. ఆంగ్లేయుల 'విభజించు-పాలించు' ఊబిలో పడకుండా హిందూ-ముస్లింలు కలసికట్టుగా ఉద్యమించాలన్నది తొలినాళ్లలో జిన్నా భావన. ముస్లింలీగ్‌లో చేరాల్సిందిగా ఎన్నిసార్లు ఆహ్వానం అందినా.. బ్రిటిష్‌ అనుకూల నాయకత్వం కారణంగా దాన్ని తిరస్కరించారు. చివరకు ఒక షరతు పెట్టి 1913లో ఆయన లీగ్‌ సభ్యత్వం తీసుకున్నారు. దేశ ప్రయోజనాలకు విఘాతం కల్గించననే తన కట్టుబాటుకు ఇబ్బంది కల్గించనంతవరకే లీగ్‌లో ఉంటానన్నది ఆయన పెట్టిన షరతు! అలా ముస్లింలీగ్‌లో చేరిన జిన్నా.. కాంగ్రెస్‌లోనూ కొనసాగాడు.

కాంగ్రెస్‌ కూడా జిన్నా రూపంలో ముస్లింలీగ్‌తో కలసి నడిచే మార్గం దొరికిందని భావించింది. అదే.. ఇరుపార్టీల మధ్య సయోధ్యకు దారి తీసి 1916 లక్నో ఒప్పందంగా మారింది. అటు లీగ్‌లో, ఇటు కాంగ్రెస్‌లో జిన్నా మాటకు విలువ పెరిగింది. కానీ గాంధీజీ రాకతో పరిస్థితి మారింది. గాంధీజీ ఆలోచన సరళి, ఉద్యమశైలితో జిన్నా విభేదించాడు. ఆంగ్లేయులపై పోరాటం చేయడానికి బదులు రాజ్యాంగబద్ధంగా స్వాతంత్య్రాన్ని సాధించుకోవాలన్నాడు. గాంధీ మద్దతిచ్చిన ఖిలాఫత్‌ ఉద్యమాన్ని తాను వ్యతిరేకించాడు. ఫలితంగా.. 1920 నాగ్‌పుర్‌ కాంగ్రెస్‌ సదస్సులో జిన్నాకు నిరసన వ్యక్తమైంది. సదస్సు నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయిన ఆయన.. కాంగ్రెస్‌కూ రాజీనామా చేశాడు. ఒక దశలో సివిల్‌ సర్వీసుల్లో భారతీయ ముస్లింలకు రిజర్వేషన్లు అవసరం లేదని ఆనాటి రాయల్‌ కమిషన్‌ ముందు వాదించిన జిన్నా రాజకీయ వైరాగ్యంతో లండన్‌ వెళ్లిపోయి రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ఆ సమయానికి ముస్లిం మెజార్టీ ప్రాంతాల్లో పాలన తమకే ఉండాలన్న ప్రతిపాదన ముస్లింలీగ్‌లో మొగ్గ తొడిగింది. అయితే తమకంటూ బలమైన నాయకత్వం లేదు. ఆ లోటు తీర్చుకునేందుకు వారికి జిన్నా కన్పించాడు. మహమ్మద్‌ ఇక్బాల్‌లాంటి ముస్లింలీగ్‌ నేతలు పట్టుబట్టి ఆయనను ఒప్పించారు. తొలుత హిందూ-ముస్లిం ఐక్యతకు రాయబారిగా వ్యవహరించిన జిన్నా.. గాంధీకి పోటీగా.. నాయకుడిగా ఆవిర్భవించేందుకు ఆరాటపడ్డాడు. భారత్‌లో ముస్లింలకు తిరుగులేని నేతగా తననుతానే భావించుకున్నాడు. ఏ సమావేశంలోనైనా, ప్రభుత్వంలోనైనా ముస్లింల తరఫున ప్రతినిధిని ఎంపిక చేయాల్సి వస్తే అది ముస్లింలీగ్‌ నుంచే ఉండాలని పట్టుబట్టడం మొదలైంది.

1937 ఎన్నికల తర్వాత ముస్లింలీగ్‌తో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి కాంగ్రెస్‌ నిరాకరించడంతో జిన్నా విభజనవాదం తీవ్రమైంది. తొలుత ముస్లింల హక్కులు, ప్రయోజనాలు కాపాడాలని మాత్రమే కోరిన ముస్లింలీగ్‌ లక్ష్యాన్ని ముస్లింలకు ప్రత్యేక ప్రాంతం కోరే దిశగా మార్చాడు జిన్నా! 1940 లాహోర్‌ తీర్మానం అదే! హిందూ మెజార్టీ కాంగ్రెస్‌ పార్టీ సారథ్యంలోని ప్రభుత్వం ముస్లింల ప్రయోజనాలను కాపాడదనే ఊహాజనిత సాకు చూపటమే తప్ప.. పాకిస్థాన్‌ ఏర్పాటు ఎందుకో ఎన్నడూ జిన్నా వివరించలేదు. అయితే జిన్నాకు లండన్‌ నుంచి లభించిన లోపాయకారీ మద్దతుతో మత ప్రాతిపదికన దేశ విభజనకు అడుగులు పడ్డాయి.

1916లో హిందూ- ముస్లిం ఐక్యత ఒప్పందానికి కారకుడైన జిన్నాయే.. 1946 ఆగస్టు 16న 'ప్రత్యక్ష చర్య'కు దిగండి అంటూ ముస్లింలను రెచ్చగొట్టి మత కల్లోలాలను ఎగదోయటం గమనార్హం! 1948 సెప్టెంబరు 11న జిన్నా మరణించాక ఆరునెలల్లోనే.. దేశం గురించి ఆయనకున్న భావనను పాక్‌ ప్రభుత్వం చిదిమేసింది. జిన్నా ప్రకటించిన రిపబ్లిక్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌ను.. ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌గా మార్చేసింది. చివరకు ఆయన వాదించిన మత ప్రాతిపదిక కూడా తేలిపోయింది. 1971లో పాకిస్థాన్‌ చీలిపోయి బంగ్లాదేశ్‌ అవిర్భవించింది.

ఇవీ చదవండి: భగత్​సింగ్​ను తప్పించాలని.. బాంబు తయారుచేస్తూ 26 ఏళ్లకే..

చెలరేగిన అల్లర్లు.. గాంధీయే ఆయుధాలు పట్టమన్న వేళ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.