ETV Bharat / bharat

భయం నుంచి పుట్టిన బడ్జెట్‌.. ఫస్ట్​ ఎప్పుడో తెలుసా?

author img

By

Published : Feb 1, 2022, 8:21 AM IST

Azadi Ka Amrit Mahotsav: బ్రిటిష్‌ రాజ్యం పోయినా.. వారి పద్ధతులు, సంప్రదాయాలు అనేకం అలాగే కొనసాగుతున్నాయి. వాటిలో ఒకటి బడ్జెట్‌! ఆంగ్లేయుల కాలంలో ఆరంభమైంది ఈ బడ్జెట్‌. ఇంగ్లాండ్‌లో నష్టాలతో దివాలా అంచులకు చేరి వ్యాపారాన్నంతటినీ అమ్ముకున్న ఓ ఊలు వ్యాపారి.. ఆర్థికవేత్తగా అవతారమెత్తి భారతావని ఆర్థిక భాగ్యచక్రాన్ని రాయటానికి శ్రీకారం చుట్టడం విశేషం.

AZADI KA AMRIT MAHOTSAV
AZADI KA AMRIT MAHOTSAV

Azadi Ka Amrit Mahotsav: 1857 ప్రథమ స్వాతంత్య్రోద్యమాన్ని (సిపాయిల తిరుగుబాటు) అణచివేసినా ఆంగ్లేయుల్లో భయం పట్టుకుంది. ఈస్టిండియా కంపెనీ నుంచి 1858లో పాలన పగ్గాలు చేపట్టిన బ్రిటిష్‌ ప్రభుత్వం... భారతీయులు మళ్లీ తిరగబడతారేమోననే అనుమానంతో తమ సైన్యాన్ని బలోపేతం చేయటంపై దృష్టిసారించింది. ఫలితంగా భారత్‌లోని బ్రిటిష్‌ ప్రభుత్వ ఆదాయంలో ఎక్కువ మొత్తం రక్షణ, భద్రత, సైనిక అవసరాలపై ఖర్చు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో.. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. దాన్ని గాడిలో పెట్టడమే కాకుండా... లోటును భారతీయుల నుంచే పూడ్చుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం స్కాటిష్‌ వ్యాపారవేత్త జేమ్స్‌ విల్సన్‌ను భారత్‌కు పంపించింది.

1805లో స్కాట్లాండ్‌లో జన్మించిన విల్సన్‌ తండ్రి ఓ ఊలు వ్యాపారి. తన ఇద్దరు కుమారుల కోసం ఓ ఊలు కర్మాగారం ఆరంభించాడు. 1824లో దాన్ని లండన్‌కు తరలించారు. బాగానే నడిచేది. 1837లో వ్యాపారం దెబ్బతింది. ఎంతగా అంటే... విల్సన్‌ సోదరులు తమ ఆస్తినంతా పోగొట్టుకున్నారు. నష్టాలతో పాటు దివాళాను తప్పించుకోవటానికి తన ఇతర ఆస్తిపాస్తులను కూడా అమ్ముకొని బయటపడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ అనుభవాలతో పాటు తనకున్న ఆలోచనలతో విల్సన్‌ ఆర్థికవేత్తగా మారాడు. 1853లో చార్టర్డ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను స్థాపించాడు. స్వేచ్ఛావాణిజ్యాన్ని డిమాండ్‌ చేస్తూ... ఎకానమిస్ట్‌ మేగజీన్‌ ను ఆరంభించాడు. బ్రిటిష్‌ పార్లమెంటుకూ ఎన్నికయ్యాడు. ఆర్థిక వ్యవహారాల్లో విల్సన్‌కు ఉన్న ప్రవేశం చూసిన బ్రిటిష్‌ ప్రభుత్వం.. భారత్‌లో ఈస్టిండియా కంపెనీ వ్యవహారాలను చూసే బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌కు ఆయనను కార్యదర్శిగా నియమించింది. కొద్దికాలం బ్రిటన్‌ ఆర్థిక వ్యవహారాలనూ చూశాడు. ఇంతలో... భారత్‌లో సిపాయిల తిరుగుబాటు తర్వాత ఆర్థిక వ్యవస్థ దెబ్బతినటంతో దాన్ని బాగుచేసే బాధ్యత ఆయనకు అప్పగించింది లండన్‌లోని బ్రిటిష్‌ సర్కారు. 1859 ఆగస్టులో ఎంపీ పదవికి రాజీనామా చేయించి... భారత్‌కు పంపించింది.

విల్సన్‌ వచ్చేనాటికి భారత్‌లో ఆంగ్లేయ సర్కారు రక్షణ (మిలిటరీ సంబంధిత) వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. 1856-57లో రూ.13.2 కోట్లు ఉన్నదల్లా... 1859నాటికి రూ.24.7 కోట్లకు చేరింది. అదే సమయంలో బ్రిటిష్‌ ప్రభుత్వ అప్పులు 36శాతం పెరిగాయి. అదే అదనుగా.. తన ఆర్థిక ఆలోచనలను అమలు చేయటం ఆరంభించాడు విల్సన్‌. ఆదాయపు పన్ను, లైసెన్స్‌ పన్ను, పొగాకు పన్ను, పేపర్‌ కరెన్సీ, బడ్జెట్‌ల రూపకల్పనతో ఆర్థిక క్రమశిక్షణ, ఆడిటింగ్‌, సివిల్‌ పోలీసు ఏర్పాటు, రోడ్లు, నిర్మాణాలకు ప్రత్యేక విభాగం.. లాంటివి విల్సన్‌ మార్కు సంస్కరణలు.

నిరుద్యోగం, క్షామం, కరవు కాటకాలు, వరదల్లాంటి పరిస్థితులు తలెత్తినా ప్రభుత్వం అతిగా స్పందించకూడదని... ప్రజల్ని పరిస్థితులకు వదిలేయాలనే బ్రిటిష్‌ ఆర్థిక సిద్ధాంతాన్ని విల్సన్‌ బలంగా నమ్మేవాడు. వలస రాజ్యాలకు, అనాగరిక జాతులకు మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత ఆంగ్లేయులపై ఉందని తన మేగజీన్‌ ద్వారా విల్సన్‌ వాదించేవాడు. అలా ఆర్థిక వ్యవస్థపై తెల్లవారి పట్టును మరింత పెంచటానికి, ముక్కుపిండి మరీ భారతీయుల నుంచి సొమ్ము లాగటానికి ఎత్తులు వేశాడు. విల్సన్‌ భారతీయులపై విధించిన ఆదాయపు పన్ను బ్రిటన్‌లో ప్రజలు చెల్లించే శాతం కంటే ఎక్కువ కావటం గమనార్హం. ఆ సమయానికి బ్రిటన్‌లో అందరిపైనా 0.83శాతం మాత్రమే ఆదాయపు పన్ను ఉంటే ఇక్కడ విల్సన్‌ 2 నుంచి 4 శాతం విధించాడు.

బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఏడాదే కోల్‌కతాలో వేసవి వేడిని తట్టుకోలేక.. అతిసార వ్యాధితో చనిపోయాడు విల్సన్‌.

AZADI KA AMRIT MAHOTSAV
జేమ్స్​ విల్సన్

గవర్నరే విమర్శించారు

1860లో విల్సన్‌ భారత్‌లో తొలి బడ్జెట్‌ ప్రవేశపెట్డాడు. అయితే ఆయన ఆలోచనలు, పద్ధతులపై ఆంగ్లేయుల నుంచే విమర్శలు వెల్లువెత్తటం విశేషం. అప్పటి గవర్నర్‌ జనరల్‌ చార్లెస్‌ కానింగ్‌ స్వయంగా లైసెన్స్‌ పన్ను, పొగాకు పన్నులను తప్పుపట్టాడు. మద్రాస్‌ గవర్నర్‌ చార్లెస్‌ ట్రెవెలిన్‌ అయితే ఏకంగా.. 'భారత దేశ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా విల్సన్‌ తన సిద్ధాంతాలను రుద్దుతున్నాడు' అని విమర్శించాడు. దీంతో లైసెన్స్‌ పన్ను, పొగాకు పన్నులపై మాత్రం వెనక్కి తగ్గారు. ఆదాయపు పన్నును కొనసాగించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: '30 ఏళ్ల తర్వాత అన్ని స్థానాల్లో పోటీ.. జైలుకు వెళ్లేందుకైనా సిద్ధం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.