Ayodhya Solar Street Guinness World Record : అయోధ్యలో అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది. ప్రపంచమే అబ్బురపడేలా ఈనెల 22న జరిగే ప్రతిష్టాపన మహోత్సవానికి అయోధ్యను సర్వంగా సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా భారత సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేలా ఇప్పటికే అయోధ్యలో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఎన్నో విశిష్టతలు ఉన్న అయోధ్య మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
అయోధ్యలోని గుప్తర్ ఘాట్ నుంచి నిర్మల్‌కుండ్ వరకు మధ్య ఉన్న 10.2 కిలోమీటర్లు దూరానికి 470 సోలార్ స్ట్రీట్ లైట్లను అమర్చారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్డ్ స్ట్రీట్ లైట్ల లైన్‌గా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అయోధ్యలోని ఈ సోలార్ లైట్ స్ట్రీట్ గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుది. ఇప్పటికే 70 శాతం సోలార్ లైట్లను అమర్చడం పూర్తయిందని, మిగిలిన 160 సోలార్ స్ట్రీల్ లైట్లను జనవరి 22 లోపు అమరుస్తామని ఉత్తరప్రదేశ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది.
కీలక ప్రాంతాల్లో 'సోలార్ ట్రీ'లు
Solar Tree In Ayodhya Uttar Pradesh : సంప్రదాయ విద్యుత్ సరఫరాపై ఆధారపడకుండా ఈ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వీధులతో పాటు కీలక మార్గాలు, ఘాట్లలోనూ 'సోలార్ ట్రీ'లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 34 పార్కుల్లో కిలో వాట్ సామర్థ్యం కలిగిన సోలార్ ట్రీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.ఎనిమిది పార్కుల్లో రెండున్నర వాట్ల సామర్థ్యం కలిగిన ట్రీలను నెలకొల్పినట్లు చెప్పారు. మరో 16 లొకేషన్లలో సోలార్ ట్రీల ఏర్పాటుకు పనులు కొనసాగుతున్నాయని వివరించారు. మొత్తంగా 52 ప్రదేశాల్లో సోలార్ ట్రీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఇంతకుముందు కూడా అయోధ్యలో జరిగిన దీపోత్సవం కూడా గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో మట్టి దీపాలను వెలిగించినందుకు ఈ రికార్డు వచ్చింది. మరోవైపు, జనవరి 22న జరిగే రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. వేలమంది సాధువులు, ప్రముఖులు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో హాజరుకానున్నారు.
భక్తుల కోసం వందలాది రూమ్స్ బుక్- అతిథులకు పునాది మట్టి, సరయూ నీటితో గిఫ్ట్ ప్యాక్
RSS చీఫ్‌కు ప్రాణప్రతిష్ఠ ఆహ్వానం- అయోధ్య రామయ్యకు కానుకల వెల్లువ