Kushinagar children death: ఉత్తర్‌ప్రదేశ్ కుషీనగర్‌లోని కాస్యా ప్రాంతంలో విషాద ఘటన జరిగింది. నలుగురు చిన్నారులు విషపూరిత చాక్లెట్లు తిని ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఒకే కుటుంబానికి చెందినవారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల్ని తోబుట్టువులు మంజనా(5), స్వీటీ(3), సమర్(2)తో పాటు ఐదేళ్ల అర్జున్‌గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కుట్ర ప్రకారమే జరిగిందా?: ముఖియా దేవి అనే మహిళ తన ఇంటిముందు ఊడుస్తున్న సమయంలో.. ప్లాస్టిక్ సంచిలో ఐదు టాఫీలు, కొన్ని నాణేలు గుర్తించింది. వీటిని తన మనవరాళ్లు, మనవడికి సహా ఇంకో పిల్లాడికి పంచిపెట్టింది. వీటిని తిన్న అనంతరం పిల్లలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని ఆమె పోలీసులకు చెప్పింది.
ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మిగిలిన మరో చాక్లెట్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. రెండేళ్ల కిందట తమ బంధువుల ఇంట్లోనూ ఇలాంటి ఘటనే జరిగిందని, ఇది కుట్ర ప్రకారమే జరిగిందని బాధిత కుటుంబం ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు.
''చాక్లెట్లు తిన్న నలుగురు అనారోగ్యానికి గురై మరణించారు. ఎవరో కావాలని ఇది చేసినట్లు అనుమానిస్తున్నాం. రెండేళ్ల కిందట తమ బంధువులకు ఇలాగే జరిగిందని ఫిర్యాదుదారు తెలిపారు. దీనిపై విచారణ చేస్తాం.''
- అఖిల్ కుమార్, గోరఖ్‌పుర్ జోన్ ఏడీజీ
సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం: చిన్నారులు మరణించిన ఘటన గురించి తెలుసుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్.. విచారం వ్యక్తం చేశారు. తక్షణ విచారణకు ఆదేశించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి: గోడ కూలి ఇద్దరు మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం