'నా భార్యను నేనెప్పుడూ కొట్ట లేదు, తిట్టలేదు - మా ఆవిడ, అత్తమామ వేధింపులు భరించలేను'
Youth Suicide in Bapatla District due to Family Disputes: కుటుంబ కలహాలతో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన చావుకు భార్య, అత్తమామల వేధింపులే కారణమని సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు. భార్య అత్త, మామల వేధింపులను భరించలేక తాను చనిపోతున్నట్లు వీడియోలో వివరించి సోదరి, స్నేహితులకు పంపించాడు.
బాపట్ల జిల్లా శృంగారపురానికి చెందిన గోపి, పూడివాడకు చెందిన లాస్యకు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. సూర్యలంక రోడ్డులో ఐస్ క్రీమ్ పార్లర్ నడిపేవాడు. ఆడపిల్ల పుట్టడంతో కుటుంబ కలహాలతో భార్య పుట్టింట్లోనే ఉంటుంది. తనపై భార్య, అత్తమామలు అన్యాయంగా కేసు పెట్టారని వీడియోలో తెలిపాడు. తనని అన్యాయంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను భార్యను ఎప్పుడూ కొట్టలేదని.. ఆడపిల్ల పుట్టిందని తిట్టలేదని కన్నీటి పర్యంతమయ్యాడు.
బలవన్మరణానికి పాల్పడినందుకు క్షమించాలని సోదరి, తాతయ్య, మామయ్యను కోరాడు. వీడియో తన సోదరి, స్నేహితులకు పంపిన వెంటనే దుకాణంలోని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీడియో చూసి స్నేహితులు వచ్చేసరికే గోపి మృతి చెందాడు. బాపట్ల డీఎస్పీ, సీఐ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. శవపరీక్ష కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.