Women teacher protest initiation : 'దారి' చూపండి సీఎం సార్.. మహిళా ఉపాధ్యాయురాలి నిరసన దీక్ష
Women teacher protest initiation : ఓ వైపు ఉపాధ్యాయ దినోత్సవ సంబురాలు జరుగుతున్న తరుణంలో మరో వైపు తనకు జరిగిన అన్యాయంపై నిరసన దీక్ష చేపట్టింది ఓ దళిత ఉపాధ్యాయురాలు. కాగా, సమస్య ఎక్కడైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోనే దీక్ష చేపట్టాలని ఆమె దీక్షను అద్దంకి పోలీసులు భగ్నం చేశారు. వివరాలివీ..
బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని గాజులపాలెం ( Gajulapalem ) ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న గొట్టిపాటి సంధ్యారాణి.. కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామంలో నివాసం ఉంటోంది. ఆమె నివాసానికి దారి లేదంటూ స్థానిక నాయకుడు కొర్రీలు పెట్టడంతో పలుమార్లు ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్లింది. అధికారులు అనుమతి లేదని చెప్పడంతో గతంలో తాడేపల్లి (Tadepalli) వద్ద బైటాయించింది. దీంతో అధికారులు స్థానిక పోలీసు స్టేషన్ కు వివరాలు పంపడంతో న్యాయం జరుగుతుందని ఆశతో వెనుదిరిగి వెళ్లిపోయింది. కానీ, ఇప్పటివరకు దారి హక్కు కల్పించకపోగా సుమారు 7అడుగుల మేర గోడను నిర్మించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బంగ్లారోడ్డు లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్షకు పూనుకుంది. దీక్ష చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు... 'మీ సమస్య ఈ స్టేషన్ పరిధిలోకి రాదు.. కొరిశపాడు మండల పరిధిలో మీరు నిరసన దీక్ష చేసుకోవాలి' అని చెప్పి భగ్నం చేశారు.