వాయుగుండంగా మారినా అల్పపీడనం - కోస్తాంధ్రలో మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు
Weather Updates in Visakha : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని అమరావతి కేంద్రంగా పనిచేస్తున్న భారత వాతావరణ విభాగం ప్రకటించింది. ప్రస్తుతం వాయుగుండం విశాఖకు ఆగ్నేయంగా 470 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతం అయి ఉన్నట్లు తెలిపింది. ఈరోజు ( నవంబరు 16 ) ఉదయానికి ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని సృష్టం చేసింది. ఇది వాయువ్య దిశగా కదిలి కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే రెండు రోజుల పాటు.. కోస్తాంధ్ర తీరం వెంబడి మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. రాగల రెండు రోజుల (నవంబరు 17, 18) పాటు మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.