ద్విచక్ర వాహనానికి పూజ చేయించుకుని వస్తుండగా ఢీకొన్న ఆర్టీసీ బస్సు, ఇద్దరు స్నేహితులు మృతి
Two Friends Died in Road Accident : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతి చెందారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కూడేరు మండలం ముద్దలాపురం వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురంలోని రుద్రంపేటకు చెందిన తేజప్రవీణ్ (23), హరినాథ్ రెడ్డి (22) కొన్నేళ్లుగా కియా పరిశ్రమలో పని చేస్తున్నారు. హరినాథ్ రెడ్డి ఇటీవలే కొత్త ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశారు. వాహనానికి పూజ చేయించడానికి స్నేహితులిద్దరూ ఉరవకొండ మండలం పెన్నోహోబిలం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ పూజ చేయించుకుని, తిరిగి ప్రయాణం అయ్యారు.
Friends Died Due To Two-Wheeler Collides with RTC Bus : ఈ క్రమంలో కూడేరు మండలం ముద్దలాపురం వద్ద జాతీయ రహదారిలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తేజ ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఈశ్వరయ్య, ఈశ్వరమ్మ ఘటన స్థలానికి చేరుకొని, ఒక్కసారి లేవరా తేజ అంటూ మృతదేహంపై పడి రోదించిన తీరు అందరినీ కలిచి వేసింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనంతపురంలో చికిత్స పొందుతూ హరినాథ్ రెడ్డి కూడా మరణించాడు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.