'ఏపీకి జగనే ఎందుకు కావాలంటే' కార్యక్రమాన్ని అడ్డుకున్న టీడీపీ నేతలు - బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు
TDP Leaders blocked Y Needs AP Jagan Programme: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'వై ఏపీ నీడ్స్ జగన్' అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డుకున్నారు. లబ్ధిదారుల అనుమతి లేకుండా టిడ్కో ఇళ్లను ఎలా తాకట్టు పెట్టారంటూ.. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో అక్కడే ఉన్న వైసీపీ నేతలు..టీడీపీ శ్రేణులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు హూటాహూటిన అక్కడికి చేరుకుని టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు.
ఉండవల్లి సచివాలయం వద్ద ఉద్రిక్తత.. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఉండవల్లి సచివాలయం వద్ద నిర్వహించిన 'ఏపీకి జగనే ఎందుకు కావాలంటే' కార్యక్రమాన్ని.. తెలుగుదేశం నేతలు అడ్డుకున్నారు. లబ్ధిదారుల అనుమతి లేకుండా టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టడంపై అధికారులను ప్రశ్నించారు. దీంతో అక్కడే ఉన్న వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. టీడీపీ నేతలను బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా నిరసిస్తూ.. రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందంటూ..నిరసన తెలుపుతున్న టీడీపీ నేతలను పోలీసులను అదుపులోకి తీసుకున్నారు.