కుటుంబ కలహాలతో కొండ ఎక్కి అక్కడే చిక్కుకున్న వ్యక్తి ! - చివరికి ఏమైందంటే?
Police Rescued Man on Hill in Satya Sai District : శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో కొండపై చిక్కుకున్న వ్యక్తిని.. పోలీసులు సురక్షితంగా కిందికి దించారు. బెంగళూరుకు చెందిన హనుమంతే గౌడ్.. కుటుంబ కలహాలతో శనివారం ఉదయం సింహగిరి కొండ ఎక్కాడు. 500 అడుగుల ఎత్తున్న కొండపై.. ఏటవాలుగా ఉన్న జారుడుబండపై చిక్కుకున్నాడు. సాయంత్రం వరకు ఆయన్ను ఎవరూ గమనించలేదు. ప్రాణాపాయ స్థితిలో ఉండటాన్ని చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానిక యువకులతో కలిసి పోలీసులు సహాయక పరికరాలతో కొండెక్కారు.
ఘటనాప్రదేశంలో బాధితుని స్వరం తప్ప వ్యక్తి కనబడలేదు. పూర్తిగా చీకటిమయం కావడంతో లైట్లు అమర్చి.. దాదాపు నాలుగు గంటల పాటు చీకట్లోనే గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు బాధితుడు లోతు ప్రదేశంలో నిస్సహాయ స్థితిలో కనిపించాడు. తాళ్ల సహాయంతో సాహసం చేసి అతని వద్దకు పోలీసులు చేరుకున్నారు. కొంత ఎత్తు నుంచి కిందకు పడడంతో కాళ్లు, చేతులు, తలకు స్వల్ప గాయాలు మినహా.. ప్రాణాపాయం తప్పింది. గాయాల పాలైన బాధితున్ని కొండపై నుంచి కిందకు తీసుకువచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. బాధితుడు కోలుకోగానే పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్థానిక ఎస్సై లోకేష్ మీడియాతో వివరించారు.