New Parliament Issue: కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవంపై సీపీఎం కీలక ప్రకటన

By

Published : May 26, 2023, 10:31 PM IST

thumbnail

New Parliament Building Inauguration Boycott news: దేశ రాజధాని దిల్లీలో నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి గత కొన్ని రోజులుగా మోదీ ప్రభుత్వానికి, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కొత్త పార్లమెంటు భవనాన్ని దేశ ప్రథమ పౌరురాలు (రాష్ట్రపతి) ద్రౌపది ముర్ము ప్రారంభించాలని సుమారు 19 ప్రతిపక్ష పార్టీల అధినేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కీలక ప్రకటన చేశారు.

రాష్ట్రపతినే నూతన భవనం ప్రారంభించాలి.. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంపై విజయవాడలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ నిబంధనలను ప్రధాని నరేంద్ర మోదీ ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ అధిపతి రాష్ట్రపతి కాబట్టి.. నూతన భవనాన్ని ప్రారంభించే అధికారం మోదీకి లేదన్నారు. మోదీ తీసుకుస్తున్న రాజదండంకు ఎలాంటి ప్రామాణికత లేదని.. దానిని నెహ్రూ మ్యూజియంలోనే ఉంచాలని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీసుకున్న నిర్ణయాలన్నీ ఎన్నికల నేపథ్యంలో తీసుకున్నవేనని ఆయన వ్యాఖ్యానించారు.

బీజేపీ నిర్ణయాన్ని బహిష్కరించిన సీపీఎం.. ''కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించాలని సీపీఎం సహా 19 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. రాజ్యాంగ నిబంధనలను ప్రధాని మోదీ ఉల్లంఘిస్తున్నారు. పార్లమెంట్ అధిపతి రాష్ట్రపతి ఆమె ఆ నూతన భవనాన్ని ప్రారంభించాలి. రాష్ట్రపతి అనుమతి లేకుండా ఏ కార్యకలాపాలు జరిగేందుకు వీల్లేదు. ఏటా పార్లమెంట్ సమావేశాలను రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభిస్తాం. మోదీ చర్యలు ఫ్యూడల్ నిరంకుశత్వాన్ని సూచిస్తున్నాయి. పార్లమెంటు భవన ప్రారంభానికి వెళ్లొద్దు.. రాజ్యంగ ఉల్లంఘనను సమర్ధించవద్దని వైఎస్సార్సీపీ అధినేతకు చెప్పాం. తుగ్లక్ పాలన లాగా మోదీ రూ.2వేల రూపాయల నోటు వెనక్కు తీసుకున్నారు. దేశంలో బీజేపీ వ్యతిరేక పార్టీలతో మేము కలువబోతున్నాం. త్వరలోనే రాజకీయ నిరసనకు సిద్ధమవుతాం'' అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.

మే 28న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం..  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 28వ తేదీన కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ   కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీలు హాజరుకావాలని కేంద్రం ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో నూతన పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బదులుగా  ప్రధాని మోదీ ప్రారంభించటంపై సుమారు 19 ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తూ లేఖను విడుదల చేశాయి. తాజాగా ఆ లిస్ట్‌లోకి సీపీఎం కూడా చేరినట్లు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రకటించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.