Minister Dharmana Prasada Rao on YSRCP Symbol: వైసీపీ గుర్తుపై మంత్రి ధర్మాన ఆసక్తికర వ్యాఖ్యలు
Published: Sep 14, 2023, 10:48 PM

Minister Dharmana Prasada Rao on YSRCP Symbol: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై ఆ పార్టీ ఎమ్మెల్యే, ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ గుర్తుపై ప్రజలకు సరైన అవగాహన కల్పించాలని.. లేకపోతే దెబ్బ అయ్యే పరిస్థితి నెలకొందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేస్తామని చెబుతూ.. గుర్తు మాత్రం సైకిల్‌కి వేస్తామని ప్రజలు అంటున్నారని ధర్మాన వ్యాఖ్యానించారు.
Dharmana Prasada Rao Comments: శ్రీకాకుళం జిల్లాలోని జ్యోతిబాపూలే కాలనీలో గురువారం 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి ధర్మాన ప్రసాదరావు విచ్చేశారు. అనంతరం సభలో ధర్మాన మాట్లాడుతూ.. ''చాలా వీధుల్లో వచ్చే ఎన్నికల్లో జగన్‌ను మళ్లీ గెలిపిస్తారా..? అని అడిగితే.. గెలిపిస్తాం అంటున్నారు. కానీ, ఓటు మాత్రం సైకిల్ గుర్తుకే వేస్తామంటున్నారు. అదే జరిగితే పార్టీకి పెద్ద దెబ్బ అయ్యే పరిస్థితి వస్తుంది. జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేస్తామని చెబుతూనే.. గుర్తు మాత్రం సైకిల్ అని అంటున్నారు. కాబట్టి, వైసీపీ గుర్తుపై పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలి. గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా ఏమిటో ప్రజలు గ్రహించాలి. జగన్ పాలనలో అనేక మార్పులు తీసుకొచ్చాం. మనకు సరిపోయే విద్యుత్ ఉత్పత్తి లేక ఈ మధ్య కాలంలో కరెంట్ కోతలు అమలు చేశాం. రాష్ట్రం అప్పులపాలయ్యిందని చెబుతున్నారు. కానీ, అందులో ఏమాత్రం సత్యం లేదు. మేము సీమెన్స్ లాంటి సంస్థలకు డబ్బులు ఇవ్వలేదు.'' అని మంత్రి ధర్మాన వ్యాఖ్యానించారు.