Protest against Power Cuts: విద్యుత్ కోతలతో ఇళ్లల్లో ఉండలేకపోతున్నాం.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
Published: May 18, 2023, 7:10 AM

Protest against Power Cuts: విద్యుత్ కోతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పాత గుంటూరులో విద్యుత్ కోతలను నిరసిస్తూ స్థానికులు ఏఈ కార్యాలయాన్ని ముట్టడించారు. యానాదికాలనీ, బాలాజీనగర్, యాదవుల బజారు, క్రిస్టిన్ కాలనీ, గాంధీ బొమ్మ సెంటర్ వాసులు విద్యుత్ కార్యాలయానికి తరలివచ్చి ఆందోళన చేపట్టారు. వారం రోజులుగా విద్యుత్ కోతలు ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు. రోజంతా పనులు చేసుకొని వచ్చి.. ప్రశాంతంగా నిద్రపోదామంటే.. కరెంట్ ఉండట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యమే ఈ సమస్యకు కారణమని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేసినా ఇంత వరకూ సమస్య తీరలేదని వాపోయారు.
అర్ధరాత్రి 2 గంటలు దాటినా సరఫరా పునరుద్ధరించలేదని వారంతా మండిపడ్డారు. అధికారులకు ఫోన్ చేసినా స్పందన లేదని వాపోయారు. సరఫరా నిలిపివేతతో ఇళ్ల వద్ద పిల్లాపాపలు, వృద్ధులు ఉన్నారని.. విద్యుత్ లేకపోవడంతో తీవ్రంగా అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరితగతిన సమస్యను పరిష్కరించాలని.. లేకుంటే ఎమ్మెల్యే, అధికారుల ఇంటిని మట్టడిస్తామని హెచ్చరించారు.