International Cruise Terminal at Visakha Port: విశాఖ పోర్టులో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి
Union Minister Sharbananda Sonowal Inaugurated International Cruise Terminal at Visakha Port: విశాఖపట్నం జిల్లా సిగలో మరో మణిహారం చేరింది. విశాఖ పోర్ట్‌లో జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా.. 96 కోట్ల రూపాయలతో నిర్మించిన క్రూయిజ్ టెర్మినల్ ముస్తాబైంది. ఈ అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్‌ను సోమవారం నాడు కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్ ప్రారంభించారు. దీంతోపాటు 600 ట్రక్ పార్కింగ్ టెర్మినల్, కవర్డ్ స్టోర్ షెడ్‌ను కూడా ప్రారంభించారు.
ఏపీలో భక్తి ఎక్కువ.. కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ..''విశాఖ పోర్టు దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోనే ఉత్తమ పోర్టుగా తీర్చిదిద్దేందుకు.. కేంద్రం తరఫున పూర్తి సహాయం అందిస్తాం. క్రూయిజ్ ద్వారా ఏక కాలంలో 2వేల మంది ప్రయాణికులు వెళ్లేందుకు వీలవుతుంది. విశాఖలో కాలుష్యం నియంత్రించే ప్రక్రియ చేపడుతున్నాం. కాలుష్య నియంత్రణలో భాగంగా కవర్డ్ స్టోరేజ్ షెడ్ ప్రారంభించాం. ఏపీ సహజ వనరులు కలిగిన రాష్ట్రం. ఏపీలో భక్తి ఎక్కువ.. భక్తి ఉన్నచోట అభివృద్ధి, ఆనందం ఉంటుంది. సాగరమాల కార్యక్రమంలో పోర్టులను ఆధునీకరిస్తున్నాం'' అని ఆయన అన్నారు.
ప్రపంచ స్థాయి సౌకర్యాలతో సేవలు అందిస్తాం.. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. రాష్ట్ర పర్యాటకాన్ని బలోపేతం చేసే విధంగా ప్రపంచ స్థాయి సౌకర్యాలతో టెర్మినల్ సేవలు అందిస్తామన్నారు. విశాఖ పోర్ట్‌లో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పోర్టు ద్వారా విశాఖ నగరం ఎంతో అభివృద్ధి చెందిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు.