Deputy CM Kottu comments: జగన్ మళ్లీ అధికారంలోకొస్తే.. అందరి లెక్కలు తేలుస్తాం: డిప్యూటీ సీఎం కొట్టు

By

Published : Jul 18, 2023, 7:32 PM IST

thumbnail

Deputy CM Kottu comments: 2024లో జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు సహా చాలా మంది ఖాతాలు మూయిస్తామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అమరావతి నిర్మాణంలో భాగస్వామి అవుతుందని ప్రకటించిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సొంత దేశంలోనే అవినీతి ఆరోపణలతో అరెస్టు అయ్యారని ఆయన అన్నారు. ఏపీలోనూ అమరావతి భూముల వ్యవహారంపై దర్యాప్తు వేగంగానే జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. అవాకులు చెవాకులు మాట్లాడటంతో పవన్ కల్యాణ్ గ్రాఫ్ వేగంగా పడిపోతోందని మంత్రి వ్యాఖ్యానించారు. ఆయన గ్రాఫ్​ను పడేసేందుకు పథకం ప్రకారమే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. పవన్​ను శాశ్వతంగా అడ్డు తొలగించుకునేందుకు ఆయన చేత లేనిపోని ఆరోపణలు చేయిస్తున్నారని మంత్రి కొట్టు వ్యాఖ్యానించారు. ప్రజారాజ్యం పార్టీని మూయించే వరకూ చంద్రబాబు నిద్రపోలేదని మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు. కాళహస్తి సీఐ అంజూయాదవ్ తప్పు ఉంటే ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ముందు జనసేన కార్యకర్తలు ఏం చేస్తున్నారో పవన్ కల్యాణ్ గమనించుకోవాలని అన్నారు.

ఔత్సాహికులకు అర్చకులుగా అవకాశం.. కేబినెట్ నిర్ణయం ప్రకారం అర్చకులకు ఉద్యోగ విరమణ లేకుండా త్వరలోనే ఉత్తర్వులు ఇస్తామని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్ఫష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా శ్రీవాణి ట్రస్టు సహకారంతో నిర్మిస్తున్న 2790 ఆలయాల్లో వీలైన చోట్ల ఔత్సాహిక బ్రాహ్మణేతరులనూ అర్చకులుగా నియమిస్తామని ఆయన వెల్లడించారు. సీజీఎఫ్ నిధులతో చేపట్టే దేవాలయాల నిర్మాణం ఆలస్యమైన చోట్ల కొత్త ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించామని రెండేళ్లు గడిచాక నిర్మించాలంటే కొత్త ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4081 దేవాలయాల్లో ధూపదీప నైవేద్యం పథకం అమలు అవుతోందని ఆయన వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టు సహకారంతో నిర్మించే 2790 దేవాలయాల్లోనూ ధూపదీప నైవేద్య పథకం అమలు చేస్తామన్నారు. అన్నవరం దేవస్థానంలో పెళ్లిళ్లు చేసుకునేందుకు వచ్చే వారి సౌలభ్యం కోసమే పాలకవర్గం సహకరిస్తోందని.. కొందరు ప్రైవేటు వ్యక్తులు, బ్రోకర్ల కారణంగా వారికి ఇబ్బందులు తలెత్తాయని మంత్రి స్పష్టం చేశారు. వివాహాలు చేసుకునేందుకు వచ్చే వారి నుంచి దేవస్థానం లాభాలను ఆశించటం లేదన్నారు. బ్రోకర్లు, ప్రైవేటు వ్యక్తుల కారణంగా ఆలయానికి చెడ్డపేరు వస్తోందన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.