Chintha Mohan on Congress Future: అధికారంలోకి వస్తే వాళ్లే సీఎం: చింతా మోహన్
Published: May 17, 2023, 6:43 PM

Chintha Mohan Comments: దేశం, రాష్ట్రంలో రాజకీయంగా విప్లవాత్మక మార్పులు రానున్నాయని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత చింతా మోహన్ చెప్పారు. కర్ణాటకలో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని ఆయన నెల్లూరులో ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు.
కాంగ్రెస్ అధికారం చేపడితే రెండున్నరేళ్లు బలిజ, కాపు సామాజిక వర్గానికి, మరో రెండున్నరేళ్లు ఇతర సామాజిక వర్గాలకు ముఖ్యమంత్రి పీఠం ఇచ్చేలా కాంగ్రెస్ అధిష్టానాన్ని తాము ఒప్పిస్తామన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని.. అది కర్ణాటక ఎన్నికలతో రుజువైందన్నారు. పేదల సంక్షేమాన్ని విస్మరించిన బీజేపీ, వైసీపీల పతనం ప్రారంభమైందన్నారు. జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్స్‌తో రాష్ట్రం అధోగతి పాలైందని దుయ్యబట్టారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించే బియ్యం ఇతర ప్రాంతాలకు యథేచ్ఛగా తరలిపోతోందని, ఇందుకోసం స్మగ్లర్లు అధికారులకు లక్షల్లో ముట్టచెబుతున్నారని ఆరోపించారు. స్కాలర్షిప్లు రాక విద్యార్థులు చదువుకు దూరమవుతుంటే, ఉపాధి లేక నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.