చంద్రబాబు ఇంటికి వచ్చిన వేళ కుటుంబ సభ్యుల భావోద్వేగం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 1, 2023, 4:12 PM IST

Updated : Nov 1, 2023, 5:15 PM IST

thumbnail

Chandrababu Family Emotion : కుటుంబ సభ్యులు, బంధు మిత్రులే కాదు.. తన ఇంట్లో పని చేసే ప్రతి ఒక్కరి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారు చంద్రబాబు. వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందిని సైతం పేరుపేరునా పలుకరిస్తూ.. వారు సెలవుల్లో వెళ్లి తిరిగి విధుల్లో చేరగానే మంచి, చెడు ఆరా తీయడం ఆయన అలవాటు. అలాంటి వ్యక్తి 53 మూడు రోజుల పాటు ఇంటికి దూరం కావడంతో ప్రతి ఒక్కరికీ గుండెలు బరువెక్కాయి. రేపోమాపో తిరిగి వస్తారంటూ కళ్లుకాయలు కాచేలా ఎదురుచూసిన ఆ హృదయాలు... ఇవాళ చంద్రబాబు రాకతో ఘొల్లుమన్నాయి. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కన్నీటిపర్యంతం కాగా.. చంద్రబాబు వారిని ఓదార్చుతూ ధైర్యం చెప్పారు. ఆప్యాయత అనురాగాల మధ్య చంద్రబాబు కళ్లు చెమర్చాయి.  

మంచే జరుగుతుంది... 'అంతా మంచే జరుగుతుంది.. అధైర్య పడకండి..' రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. కుటుంబ సభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలివి. ఎలాంటి ఆధారాలు లేకుండా, ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా 53 రోజుల అక్రమ నిర్బంధం.. 14 గంటల ప్రయాణం చేసి చంద్రబాబు ఇంటికి చేరుకోగానే నారా, నందమూరి కుటుంబ సభ్యులు అప్యాయంగా పలకరించారు. కొందరు కుటుంబ సభ్యులు భావోద్వేగాన్ని ఆపుకోలేక కంట నీరు పెట్టారు. దీంతో ఒకానొక దశలో చంద్రబాబు సైతం భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. 

జైలుకు వెళ్లకముందు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న చంద్రబాబు.. అక్కడ పడిన ఇబ్బంది ఏ స్థాయిలో ఉందో ఆయన్ను చూడగానే కుటుంబ సభ్యులకు అర్ధమైంది. భువనేెశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, బాలయ్య, రామకృష్ణ చంద్రబాబును రాజమండ్రి జైలులో ములాఖత్ ద్వారా కలిశారు. కానీ, మిగిలిన కుటుంబ సభ్యులు ఇన్నాళ్లకు చంద్రబాబును ఈ తీరున చూడడంతో కలత చెంది కన్నీటి పర్యంతమయ్యారు. చంద్రబాబును చూడగానే.. పిల్లలు, మహిళలు ఉబికి వస్తున్న కన్నీళ్లను పంటి బిగువన అదిమిపట్టి రోదించారు. 'అంతా మంచే జరుగుతుంది.. అధైర్య పడకండి..' అంటూనే చంద్రబాబు సైతం భావోద్వేగానికి లోనయ్యారు.

Last Updated : Nov 1, 2023, 5:15 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.