లారీ వెళ్తుండగా కూలిన వంతెన - డ్రైవర్, క్లీనర్ సేఫ్, వీడియో వైరల్
Published: Nov 21, 2023, 4:27 PM

Bridge Collapse Incident in Anantapur District : అనంతపురం జిల్లా కణేకల్‌లోని వడియార్ చెరువు వంతెన కూలిపోవడంతో లారీ నీటిలో పడిపోయింది. గంగాలాపురం నుంచి ధాన్యంతో వస్తున్న లారీ చెరువు దాటుతుతండగా వంతెన కూలడంతో ప్రమాదం జరిగింది. లారీలోని ధాన్యం బస్తాలు పూర్తిగా చెరువులో పడిపోయాయి. వంతెన కూలడంతో కణేకల్, గంగలాపురం, రచ్చుమర్రి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రమాదం నుంచి లారీ డ్రైవర్, క్లీనర్ క్షేమంగా బయటపడ్డారు. గత ప్రభుత్వం హయాంలో హెచ్‌ఎల్‌సీ కాలువ రెగ్యులేటరీలు, ప్రధాన వంతెనలు మంజూరయ్యాయి. వంతెన నిర్మాణాలు ప్రారంభం అయిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు మెుదలయ్యాయి. ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారిపోవడంతో హెచ్‌ఎల్‌సీ కాలువ మరమ్మతులకు ఎలాంటి నిధులు మంజూరు కాకపోవడంతోనే.. ప్రధాన వంతెన కూలిపోయినట్లు స్థానికులు, రైతులు విమర్శిస్తున్నారు.
అదేవిధంగా జిల్లాలోని బొమ్మనహాళ్, కణేకల్ మండలాల్లో గత రెండేళ్లలో హెచ్‌ఎల్‌సీ కాలువపై నిర్మించిన మూడు ప్రధాన వంతెనలు కూలిపోయాయి. గతంలో బొమ్మనహాల్ వద్ద హెచ్‌ఎల్‌సీ కాలువపై కూలీలతో వెళ్తున్న ఆటో.. వంతెన కూలి కాలువలో పడిపోవడంతో ఓ మహిళ మరణించింది. ప్రభుత్వం హెచ్‌ఎల్‌సీ ఆధునీకరణ పనులు చేపట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి ప్రజలు కోరుతున్నారు.