మధుమేహంపై పిల్లల్లో అవగాహన కల్పించాలి: జస్టిస్ జయసూర్య
Book Launched by Justice Jayasurya and Brahmanandam : మధుమేహ వ్యాధిపై పిల్లల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య అభిప్రాయపడ్డారు. మధుమేహ వ్యాధిపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో 20 వేల మంది విద్యార్ధులు పాల్గొనటం విశేషమన్నారు. ప్రపంచ డయాబెటిక్ దినోత్సవం నేపథ్యంలో వీజీఆర్ డయాబెటిక్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్ నెస్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య, హాస్యనటుడు బ్రహ్మానందం పాల్గొన్నారు. మధుమేహ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ వేణుగోపాలరెడ్డి తెలుగు, హిందీల్లో రాసిన పుస్తకాలను ప్రముఖులు ఆవిష్కరించారు. వ్యాధి లక్షణాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పుస్తకంలో విశ్లేషణాత్మకంగా వివరించినట్లు తెలిపారు. వ్యాధి ఎలా వస్తుంది.. ఎందుకు వస్తుంది అనే విషయాలపై చిన్నారులకు అవగాహన కల్పిస్తే భవిష్యత్ భద్రంగా ఉంటుందని ప్రముఖులు అన్నారు.
బ్రహ్మానందం మాట్లాడుతూ.. మంచి పుస్తకాలు, సాహిత్యం మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 7.5 కోట్ల మంది చక్కెర వ్యాధితో బాధపడుతున్నారని తాజా లెక్కలు చెబుతున్నాయి. రానున్న 20 ఏళ్లలో వీరి సంఖ్య 12 కోట్లకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యాధి పెరగటానికి పేదరికం, విద్య లేకపోవటం, నిర్లక్ష్యంగా వ్యవహరించటమే ప్రధాన కారణాలని తెలిపారు.