ETV Bharat / state

పులివెందులలో 180 మందికి గన్ లైసెన్సులా.. ఎవర్ని చంపేందుకు :టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి

author img

By

Published : Apr 2, 2023, 4:38 PM IST

Updated : Apr 3, 2023, 6:39 AM IST

TDP MLC Bhumi Reddy Ramgopal Reddy : కడప జిల్లాలో విచ్చలవిడిగా మంజూరు చేసిన గన్ లైసెన్స్ లపై టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీనే స్వయంగా తుపాకీ లైసెన్స్​లు ఇప్పించడం దేనికి నిదర్శనం అని ప్రశ్నించారు. ఎంత మంది టీడీపీ నాయకులను చంపించాలనుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.

టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి
టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి

TDP MLC Bhumi Reddy Ramgopal Reddy : కడప జిల్లా పులివెందులలో భరత్ యాదవ్ కాల్పుల ఘటన, తదనంతర పరిణామాలపై టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ .. కడప జిల్లా పులివెందులలో భరత్ యాదవ్ కాల్పుల ఘటన విస్మయానికి గురి చేస్తోందని.. జిల్లా వ్యాప్తంగా 800, పులివెందుల నియోజకవర్గంలో 180 మందికి గన్ లైసెన్స్​లు ఉన్నాయని తెలిపారు. పోలీసులు అధికార పార్టీ వైఎస్సార్సీపీ తొత్తులుగా మారి ఇష్టాను సారంగా గన్ లైసెన్స్, గన్​మెన్లను ఇస్తున్నారని మండిపడ్డారు. భరత్ యాదవ్​కు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు.. గన్ అవసరం లేదని ఆయన దరఖాస్తును తిరస్కరించారని.. అయినా స్థానిక పోలీసులు లైసెన్స్ మంజూరు చేశారని భూమిరెడ్డి ఆరోపించారు.

టీడీపీ నేతలపై వివక్ష.. వైసీపీలో చాలా మందిపై పోలీసు కేసులు ఉన్నా కూడా గన్ లైసెన్స్ ఇచ్చారని ఆయన మండిపడ్డారు. టీడీపీ నాయకులు గన్ లైసెన్స్ కావాలని కోరితే కేసులు ఉన్నాయని తిరస్కరిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తనకు ప్రాణహాని ఉందని చెప్పినా కూడా ఒక్క గన్​మెన్​ను కూడా ఏర్పాటు చేయలేదని గుర్తు చేశారు. అమాయకులను, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ఇంకా ఎంతమందిని పోలీసులు లైసెన్స్ లు ఇచ్చి బలిగొంటారని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. దయచేసి అర్హత, అవసరం లేని వారికి మాత్రం గన్ లైసెన్స్, గన్​మెన్లను ఇవ్వొద్దని, అవసరాన్ని గుర్తించి లైసెన్స్​లు మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భూ కబ్జా దారులకు, రౌడీలకు గన్​మెన్​లను, గన్ లైసెన్స్​లు ఏవిధంగా ఇచ్చారని ప్రశ్నిస్తూ.. గన్​లైసెన్స్​లపై పోలీసులు సమీక్ష జరపాలని, లేకపోతే త్వరలో ఆధారాలతో సహా హై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామని టీడీపీ ఎమ్మెల్సీ భూమి రెడ్డి రాంగోపాల్ రెడ్డి తెలిపారు.

పులివెందులలో భరత్ యాదవ్ అనే వ్యక్తి కాల్పులు జరపడంతో ఓ వ్యక్తి మృతి చందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఇష్టారాజ్యంగా గన్ లైసెన్స్ లు మంజూరు చేయడం విస్మయానికి గురి చేస్తోంది. జిల్లాలో ఉన్న పోలీస్ యంత్రాంగం కంటే పోలీసులు మంజూరు చేసిన గన్ లైసెన్స్ లే అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో సింహాద్రిపురం నుంచి 28మంది వైఎస్సార్సీపీ నాయకులకు గన్ లైసెన్స్​లు ఇచ్చారు. వేముల మండలంలో 11మందికి వేంపల్లిలో 39మందికి, లింగాలలో 8మందికి, పులివెందుల మండలంలో 84, తొండూరు మండలంలో ముగ్గురికి లైసెన్స్​లు ఇచ్చారు. మొత్తం కడప జిల్లా వ్యాప్తంగా దాదాపు 800 మందికి గన్ లైసెన్స్​లు ఇచ్చారు. ఎవరైన్ పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లు.. తమ ప్రాణాలకు ముప్పు ఉందంటే విచారణ జరిపి లైసెన్స్​ ఇవ్వాలి తప్ప.. దొంగలు, దోపిడీ దారులకు లైసెన్స్ లు ఎందుకు ఇస్తున్నారో పోలీసులు చెప్పాలి. భరత్ యాదవ్ కేసులో డొంక తిరుగుడు సమాధానాలు చెప్తున్నారు. భరత్ యాదవ్ 2021 ఏప్రిల్ 16న దరఖాస్తు చేసుకుంటే.. 2022 అక్టోబర్ 17న లైసెన్స్ మంజూరు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తోంది. కాల్చి చంపడానికి లైసెన్స్​లు ఇచ్చింది. ఇప్పటికైనా గన్ లైసెన్స్​లపై పునసమీక్ష చేయాలి. భరత్ యాదవ్ కాల్పుల ఘటన తర్వాత నాకు గన్ మెన్​ను కేటాయించారు తప్ప అంతకు ముందు ఇవ్వలేదు. - భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ

టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి

ఇవీ చదవండి :

Last Updated :Apr 3, 2023, 6:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.